వరుస సస్పెన్షన్ల దడ..! అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తున్న ఉన్నతాధికారుల చర్యలు

by Shiva |
వరుస సస్పెన్షన్ల దడ..! అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తున్న ఉన్నతాధికారుల చర్యలు
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: పోలీసు శాఖలో వరుస సస్పెన్షన్లు అందరిలో దడ పుట్టిస్తున్నాయి. సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పడంతో పాటు అక్రమ వ్యాపారాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసుల్లో కొందరు సార్థ స్వప్రయోజనాల కోసం చేసిన అక్రమాలు ఆ వ్యవస్థకే మచ్చ తెస్తున్నాయి. పోలీసు అధికారులు, సిబ్బంది చేసే వ్యవహారాలు బయటపడితే తప్పా గతంలో కొంతమంది ఇష్టారీతిగా విధులు నిర్వహించారు. కొన్ని పోలీస్ స్టేషన్లలో అధికారులు, సిబ్బందికి వచ్చే జీతం కన్నా.. ఇతర దందాల నుంచి వచ్చే సంపాదనే ఎక్కువ అన్న ఫిర్యాదులు కూడా ఉన్నతాధికారుల వరకు వెళ్లాయి. అక్రమ వ్యాపారులతో ప్రత్యక్షంగా.. పరోక్షంగా చేతులు కలిపి అక్రమార్జనకు ప్రాధాన్యం ఇచ్చారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంకా కొంతమంది సిబ్బందిలో భయాందోళన నెలకొన్నట్లుగా తెలుస్తుంది.

ఇసుక, బియ్యం దందాలే ప్రధానం..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక, రేషన్ బియ్యం, మట్టి, మద్యం దందాలు అక్రమార్కులతో పాటు, పోలీసులకు పంట పండిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇసుక రీచ్‌లు, మట్టి తరలింపులు, అక్రమ బియ్యం, మద్యం దందాలు జోరుగా సాగుతున్నాయి. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి గద్వాల జిల్లా మీదుగా ఆంధ్రా ప్రాంతానికి తరలివెళ్లే మద్యం సరఫరా కొన్ని చోట్ల పోలీసుల అండదండలతోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రోజువారీ మామూళ్లు, మరికొన్ని చోట్ల నెల మామూళ్లు పోలీసులకు అందుతున్నాయని ఇసుక, మట్టి వ్యాపారులు బాహాటంగానే చెబుతున్నారు.

రూ.కోట్లకు పడగలెత్తారు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొన్ని జిల్లాలు, మండలాల్లో పని చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది రూ.కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. ఇసుక, మట్టి, బియ్యం దందాలతోపాటు గతంలో భూ దందాలు, తగాదాలలో తల దూర్చడంతో కొంతమంది పోలీసు అధికారులు, సిబ్బంది అక్రమ ఆస్తులు వెనుకేసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఒకవైపు రాజకీయ నాయకులు, మరోవైపు ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో కొంతమంది ఖాకీలు అక్రమ సంపాదనకు ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

సస్పెన్షన్లతో దడ..

అక్రమ ఇసుక, బియ్యం, మద్యం దందాలను అదుపు చేయాల్సిన పోలీసు అధికారులు, సిబ్బంది అందుకు బదులుగా అక్రమార్కులకు పరోక్షంగా అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాల గురించి ఫిర్యాదులు అందినప్పటికీ వాటిని లెక్కచేయకుండా వ్యవహరించి అక్రమ దందా చేసే వారికి అండగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, అవే ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఫిర్యాదులపై విచారణ అనంతరం వచ్చిన నివేదికల ఆధారంగా నాగర్ కర్నూలు జిల్లాలో నలుగురు ఎస్ఐలు, వనపర్తి జిల్లాలో ఒకరు, జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు ఎస్పీ కార్యాలయాలకు సరెండర్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జంటల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు విదితమే. వనపర్తి జిల్లాలోనూ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో తలదూర్చిన ఇద్దరు కానిస్టేబుళ్లను సైతం ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అక్రమ బియ్యం సరఫరా వ్యవహారంలో తలదూర్చుతున్నారనే విషయాలపై గద్వాల పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వారం రోజులలోపు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు ఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడంతో మిగతా వారిలో ఆందోళన మొదలైంది. ఇంకా ఎవరెవరిపై చర్యలు ఉంటాయోనని చర్చ సాగుతోంది.

చక్కదిద్దే పనిలో ఉన్నతాధికారులు..

అక్రమ వ్యాపారాల్లో తలదూర్చకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లపై వచ్చిన ఫిర్యాదులను పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకున్నారు. మరి కొంతమందిపై కూడా విచారణ జరిపి తప్పులు చేసి ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. మొత్తంపై పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉన్నత అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల సాధారణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed