మేడం..సార్..మీరు వెళ్లొద్దు...!!రోధించిన విద్యార్థులు

by Naveena |
మేడం..సార్..మీరు వెళ్లొద్దు...!!రోధించిన విద్యార్థులు
X

దిశ,తుంగతుర్తి: సార్,మేడం...మీరు వెళ్లొద్దు...! అంటూ బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను విద్యార్థులంతా చుట్టుముట్టి కొంతసేపు బోరున విలపించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. మీ శిక్షణలో పెరిగిన మేము ఎలా ఉండగలం..? అంటూ వారంతా విషాద వదనంతో చెమ్మగిల్లిపోయారు. ఈ సంఘటన తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది. గత కొన్నేళ్లుగా పనిచేసి అందరి మన్నలను పొంది వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళుతున్న పాలకూరి జ్యోతి,బీవనపల్లి శ్రీనివాస్ (పదోన్నతిపై)లకు పాఠశాల యాజమాన్యం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిత్తలూరి వెంకట రామనర్సమ్మతో పాటు.. ఉపాధ్యాయ బృందమంతా వారిని సన్మానిస్తూ సేవలను కొనియాడారు. రాష్ట్ర,జిల్లా స్థాయిలో పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెంపొందింపచేయడంలో.. బదిలీపై వెళుతున్న వారి పాత్ర మర్చిపోలేమంటూ వివరించారు. అనంతరం వెళ్ళిపోతున్న ఉపాధ్యాయులను విద్యార్థులంతా రోధిస్తూ చుట్టుముట్టారు. చివరికి అక్కడున్న వారంతా నచ్చజెప్పడంతో.. అయిష్టాన్ని ఇష్టంగా చేసుకొని వీడ్కోలు తెలిపారు. ఇదిలా ఉంటే డీఎస్సీ 2024 తో ఎంపికై వచ్చిన ఉపాధ్యాయులను స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాలకుర్తి ఎల్లయ్య,మల్లెపాక రవీందర్,గట్టు మాధవి,నవీన,భవాని,అనిల్ కుమార్,విక్రమ్,రమాదేవి,మంజులలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed