- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడులో కాంగ్రెస్ జెండా పాతిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
దిశ, సంస్థాన్ నారాయణపురం : దేశమంతా ఎదురు చూసిన మునుగోడు ఉపఎన్నికల్లో హోరాహోరి పోరులో 2022లో అప్పటి బీజేపీ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ప్రజల్లో చర్చ నడుస్తున్నదని అందుకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022లో జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 100 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేసి సీపీఐ, సీపీఎం పొత్తుతో స్వల్ప మెజార్టీతోనే బయటపడింది. కానీ సొంత ఇమేజ్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 20,000 ఓట్లు కూడా లేని బీజేపీని 86 వేల ఓట్లు సంపాదించి బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించారు. కానీ తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు వెల్లడించిన ఫలితాలలో 1,18,781 ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థి పై 40,138 వేల భారీ ఆధిక్యాన్ని సంపాదించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గత సంవత్సరంలో 97,006 ఓట్లు సంపాదించగా తాజాగా 78,643 ఓట్లు సంపాదించారు.
అతివిశ్వాసమే బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కారణం..
గత సంవత్సరం ఉపఎన్నికలలో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తాను సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులే తిరిగి గెలిపిస్తాయని అతివిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీంతో పార్టీలో ఉన్న అసంతృప్త ప్రజాప్రతినిధులను కూడా ఖాతరు చేయలేదు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై తీవ్ర అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ మండల ప్రజాప్రతినిధులను దగ్గరికి తీసుకోవడంలో ఎలాంటి చొరవ చూపలేదు. అంతే కాకుండా వారిని మరింత ఇబ్బందులకు గురిచేయడం నియోజకవర్గంలో ఆయనకు మైనస్ అయ్యిందని చెప్పవచ్చు. సొంత పార్టీకి చెందిన అసంతృప్త ప్రజాప్రతినిధులను హెచ్చరించేందుకు ఏకంగా మండలానికి చెందిన ఓ ఎంపీపీని పార్టీ నుండి బహిష్కరింప జేయడం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటమికి నాంది పలికింది. దీంతో నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ ప్రజాప్రతినిధులు అంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వీరంతా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై కసితో స్థానికంగా చాలా కష్టపడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెజార్టీని పెంచేందుకు పనిచేశారని చెప్పవచ్చు.
స్థానిక నాయకుల వ్యవహార శైలితో బీఆర్ఎస్ ఓటమి..
మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటమి చెందడానికి స్థానిక నాయకుల వ్యవహార శైలి కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సొంత మండలం సంస్థాన్ నారాయణపురంలో తనకు మంచి మెజారిటీ వస్తుందని నమ్మకం పెట్టుకొని ఇన్చార్జీలుగా నియమించిన స్థానిక నేతలు ఆయన ఓటమికి కారణమయ్యారు. ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించడంలో స్థానిక నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. అంతేకాకుండా పార్టీ నుంచి ఓటర్లకు అందించిన సహాయాలను వారికి చేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున అందిస్తున్న సంక్షేమ పథకాల అర్హుల ఎంపికలు స్థానిక నాయకులను నమ్మిఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎంపిక చేయడం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో ఈ ప్రభావం మండలంలో ఓటింగ్ పై ప్రభావం చూపింది. ఒక్క సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 1200 ఓట్ల మెజార్టీ రావడం స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకుల అలసత్వానికి నిదర్శనం. అభ్యర్థిని గెలిపించడం కంటే కూడా తమను సొంతంగా ప్రమోట్ చేసుకోవడం పైనే స్థానిక నాయకులు దృష్టి సారించడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటమికి కారణాలు అయ్యాయి.