- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుప్పుమంటున్న గుట్కా.. కోదాడ కేంద్రంగా జోరుగా దందా
దిశ, కోదాడ : కోదాడ నియోజకవర్గంలో గుట్కా గుప్పుమంటోంది. కోదాడ, మునగాల, అనంతగిరి, చిలుకూరు, మోతే, నడిగూడెం మండలాల్లోని ఆయా గ్రామాల్లో నిషేధిత గుట్కా, పాన్ మసాలాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గుట్కాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట పడడం లేదు. గుట్కాకు బానిసలై యువత భవిష్యత్తు చిత్తు చేసుకుంటోంది. చట్టాల్లోని లోసుగులు, ఇంటి దొంగల సహకారంతో ఆరు మండలాల్లో కొందరు యథేచ్ఛగా గుట్కా దందాను కొనసాగిస్తున్నారు. విచ్చలవిడిగా బస్తాల కొద్ది గుట్కా ప్యాకెట్లు నియోజకవర్గానికి వస్తున్నా సంబంధిత శాఖల అధికారులు వీటిని నియత్రించలేకపోతున్నారు. కోదాడ పట్టణంలో గుట్కా నిల్వలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గుట్కా విక్రయాలు నిషేధం అమల్లో ఉంది.
అయితే, పక్క రాష్ట్రం కర్ణాటకలో గుట్కా విక్రయాలకు అనుమతులు ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి జిల్లాకు చెందిన గుట్కా మాఫియా పెద్ద మొత్తంలోనే గుట్కాను ఆయా మండలాల్లోని గ్రామాలకు తీసుకొచ్చి కిరణాషాపులు, పాన్ షాపులకు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారం నెలకు రూ.కోట్లలోనే లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుట్కా విక్రయాలపై పోలీసులు పూర్తిస్థాయిలో తనిఖీలు లేకపోవడంతో మాఫియా రెచ్చిపోయి ఈ దందాను సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు గుట్కా ప్యాకెట్ల కేసులు జిల్లాలో నమోదు అవుతున్నా వారి కళ్లు గప్పి రూ.కోట్లలో అక్రమం సంపాదన అర్జిస్తున్నారు. ఈ మేరకు గత నెల 24నుంచి వచ్చే ఏడాది మే 24వరకు నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో వాటి విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే కోదాడకు చెందిన పలువురు హోల్ సేల్ వ్యాపారులు గుట్కా, పాన్ మసాలాలను పెద్దఎత్తున దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
అధిక ధరలకు విక్రయం..
రాష్ట్ర ప్రభుత్వం పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తులను నిషేధించింది. వాటితో తయారై ఉత్పత్తులు జిల్లాలో ప్రధానంగా అంబర్, ఆర్ఆర్, అనార్, పాన్ బహార్, విమల్, బాహుబలి ఉన్నాయి. నిషేధానికి ముందు అంబర్, ఆర్ఆర్, అనార్ వంటి పొగాకు పొట్లాలు రూ.15కు లభించగా ప్రస్తుతం వాటి ధర రూ.30నుంచి రూ.40వరకు ఉంది. పాన్ బహార్, విమల్, బాహుబలి వంటి పౌచ్లు రూ.10కి లభించగా ఇప్పుడు రూ.20నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. పట్టణంలోని హోల్ సేల్ వ్యాపారులు ఒక్కో బస్తా ధర డబుల్ చేయడం మూలంగానే తాము అధిక ధరలకు విక్రయించాల్సి వస్తుందని పాన్, కిరాణాషాపుల యజమానులు తెలుపుతున్నారు. నిషేధిత గుట్కా, పాన్ మసాలాల విక్రయాలు జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ, పోలీస్ అధికారులు ఇప్పటివరకు కనీస తనిఖీలు చేపట్టకపోవడం గమనార్హం.
కర్ణాటక నుంచి సరఫరా..
కర్ణాటక నుంచి గుట్కా మాఫియా చాలా సులువుగా వాటిని జిల్లాకు తీసుకొస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల మీదుగా గుట్కా ప్యాకెట్లను జిల్లా కేంద్రంతోపాటు ఇతర పట్టణాలకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి గ్రామాలకు తరలిస్తున్నారు. గుట్కాను రవాణా చేసే అక్రమార్కులు టాటా మ్యాజిక్, ఆటో, కార్లు, ద్విచక్ర వాహనాల్లో వీటిని పోలీసుల కంటపడకుండా తరలిస్తున్నారు. జిల్లాలోని కిరాణ షాపులకు వీటిని తరలించి విక్రయాలు సాగిస్తున్నారు. కొందరు మాఫియాగా మరి అక్రమ రవాణే వృత్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో సుమారు నెలకు రూ.20కోట్ల నుంచి రూ.25కోట్లకు పైగా ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఉండడంతో సరఫరాదారులు పట్టుబడినా, కేసులైనా బెయిలు పొంది అదే దందాను మళ్లీ కొనసాగిస్తున్నట్లు సమాచారం. గుట్కా మాఫియాకు ఇంటి దొంగల సహకారం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు, ఉన్నతస్థాయి అధికారులు దీనిపై నిఘా ఉంచినా వారి కళ్లు గప్పి విక్రయాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా గుట్కా విక్రయాలను అరికట్టేందుకు సంబంధిత శాఖ అధికారులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
మత్తుకు బానిస..
నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఏజెన్సీ మండలాల్లోని గ్రామాల్లో పుష్కలంగా లభిస్తున్నాయి. దీంతో యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుట్కాలు తింటూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. క్యాన్సర్ వ్యాధులకు గురై కొందరు మృత్యువాత పడుతుండగా ఒకవైపు ఆర్థికంగా చితికి పోయి ప్రాణాలను కోల్పోతున్నారు.
ప్రత్యేక నిఘా పెట్టాం: డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి
గుట్కాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గుట్కాలు అక్రమ రవాణా కాకుండా నియోజకవర్గంలోని కోదాడ, మునగాల, చిలుకూరు, నడిగూడెం, మోతే మండలాల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టాం. యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గ్రామాల్లో గుట్కా ప్యాకెట్లు అమ్మినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. వీటి రవాణాపై ఎవరైనా సమాచారం ఇస్తే వారి విషయాలు గోప్యంగా ఉంచుతాం.