వ్యవసాయమార్కెట్‌లో కర్చీఫ్ కింగ్..మొత్తం అతనిదే హవా..

by Aamani |
వ్యవసాయమార్కెట్‌లో కర్చీఫ్ కింగ్..మొత్తం అతనిదే హవా..
X

దిశ, సూర్యాపేట టౌన్: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కి అవినీతి జాడ్యం పట్టుకుంది. మార్కెట్ లో పనిచేస్తున్న కర్చీఫ్ కింగ్ పాగా వేసుకుని కూర్చున్నాడు. వ్యవసాయ మార్కెట్ లోని ఓ అధికారి అక్రమ సంపాదన అడ్డు అదుపు లేకుండా పోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనుకున్నాడేమో అందిన కాడికి దండుకుంటున్నాడు. ఇప్పటికే సోమవారం మార్కెట్ శిస్తు సగం ఆయన జేబులో వేసుకొని లక్షలు గడించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కర్చీఫ్ కింగ్ మార్కెట్ లో ప్రతి సోమవారం సంతకు వచ్చే పశువులను కొనుగోలు చేయడానికి, అమ్మడానికి వచ్చే వ్యాపారస్తులు ఈయన చేతులు తడపాల్సిందే. మూతికి కర్చీఫ్ కట్టుకొని తలకి టోపి పెట్టుకొని సంతకు వచ్చే వాహనాల చుట్టూ తిరుగుతూ తనకు నచ్చినంత డబ్బులు వసూలు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని బాధితులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

కర్చీఫ్ కింగ్ పెత్తనం ....

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో వ్యాపారం చేస్తున్న కమిషన్ దారుల, ఖరీదు దారుల మధ్య ఏమైనా తగాదాలు, విభేదాలు చోటు చేసుకుంటే ఆ పంచాయితీలో కర్చీఫ్ కింగ్ ఉండాల్సిందే. మార్కెట్ లో చోటు చేసుకున్న పంచాయితీలలో తలదూర్చడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. మంచి మాటకారి కావడంతో మార్కెట్ ఖరీదు దారులు మార్కెట్ కార్యదర్శి కంటే ఆ కర్చీఫ్ కింగ్ దగ్గరే సమస్యలు వెల్లుబుచ్చుతారు. పని జరిగితే ఆ రోజు కర్చీఫ్ కింగ్ జేబు నిండుగా ఉంటుంది. మార్కెట్ లో పనిచేస్తున్న సిబ్బందికి కర్చీఫ్ కింగ్ అంటే హాడల్. గతంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి కర్చీఫ్ కింగ్ నీ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ తీసుకురావడంలో రాష్ట్రస్థాయిలో పైరవీలు చేసి సూర్యాపేట మార్కెట్ కు తీసుకువచ్చాడు.

ఆ కార్యదర్శి సూర్యాపేట మార్కెట్ నుంచి బదిలీ అయిన వెంటనే కర్చీఫ్ కింగ్ తన విశ్వరూపం ను ఖరీదు దారులు, కమిషన్ దారులు, పశువుల వ్యాపారస్తులపై చూపడం ప్రారంభించాడు. వారం వారం పశువుల సంతలో మార్కెట్ శిస్తు రూపంలో డబ్బులు వసూలు చేసి అతని జేబులో వేసుకుంటాడు. అంతేకాకుండా తనకు నెలవారీగా మాముళ్లు ఇచ్చిన వారితో సఖ్యంగా ఉండటం, మాముళ్లు ఇవ్వని ఖరీదు దారులు, కమిషన్ దారులను ఎదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేయడం కర్చీఫ్ కింగ్ నైజం. మార్కెట్ లో కర్చీఫ్ కింగ్ హవా సాగుతుండటంతో చేసేది ఏమి లేక బాధితులు మూతి మీద వేలేసుకుంటున్నారు.

డబ్బులు వసూలు చేయడంలో ఆయన స్టైలే వేరు..

ప్రతి సోమవారం వ్యవసాయ మార్కెట్ సంత కి ఇతర రాష్ట్ర ల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారస్తుల కు కర్చీఫ్ కింగ్ హుకుం చేశారు. పశువులను కొనుగోలు చేసి వెళుతున్న వ్యాపారస్తులు రూ. 200 నుంచి రూ.2000 ఇవ్వాల్సిందేనని, లేకపోతే మార్కెట్ కి మీ పశువులను తీసుకురావద్దని వ్యాపారస్తులు చెప్పడంతో వ్యాపారస్తులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు.

రహదారి వెంట రసీదు లేకుండా వెళ్తే సంబంధిత అధికారులు ఆపుతున్నారని వ్యాపారస్తులు అనడంతో ఆపిన వారికి నా పేరు చెప్పండి అంటూ వారికి హుకుం జారీ చేసినట్లు బహిరంగ విమర్శలు గుప్పుమంటున్నాయి. కర్చీఫ్ మూతికి కట్టి తలకు టోపీ పెట్టి బైక్ పై తిరుగుతూ పశువులను తీసుకెళ్తున్న వాహనాల వెనక తిరిగి అక్రమంగా వసూళ్లకు పాల్ప డుతున్నారనీ భారీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందల కొద్ది వాహనాలు సంతకు వస్తుంటే, సగం పన్ను వసూలు చేసి కర్చిఫ్ కింగ్ జేబులో వేసుకుంటున్నట్లు పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వ్యవసాయ మార్కెట్ పై, ప్రతి సోమవారం మార్కెట్ కి ఆదాయాన్ని పెంచే పశువుల సంత పై, దృష్టి సారించి మార్కెట్ ఆదాయానికి గండి కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్న కర్చీఫ్ కింగ్ పై విచారణ జరిపి మార్కెట్ ఆదాయాన్ని కాపాడాలని జిల్లా ప్రజానీకం కోరుకుంటుంది.

వారం వారం మార్కెట్ శిస్తు మారుతుంది : సంతోష్ కుమార్,మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి

ప్రతి సోమవారం మార్కెట్ కి వచ్చే శిస్తూ మారుతూ ఉంటుంది. ఒక వారం ఎక్కువ పశువులు రావడం ఒక వారం తక్కువ పశువులు సంత కి రావడంతో శిస్తు ఎప్పుడు సమానంగా ఉండదు. వారానికి వారానికి మారుతూ వస్తుంది. సంతలో మార్కెట్ శిస్తు పేరుతో డబ్బులు వసూలు చేస్తు తమ జేబు లలో వేసుకున్నట్లు మా దృష్టికి రాలేదు. అలా ఎవరైనా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.

Advertisement

Next Story