SLBC సొరంగ మార్గాన్ని పూర్తి చేయడం నా బాధ్యత : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

by Julakanti Pallavi |
SLBC సొరంగ మార్గాన్ని పూర్తి చేయడం నా బాధ్యత  : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

దిశ,కనగల్లు: ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గాన్ని పూర్తి చేయడం తన బాధ్యతని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం కనగల్ మండలం చిన్న మాదారం గ్రామంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33-11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు, డ్రైనేజీలు నిర్మిస్తామని, 100 కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, వేయిస్తానని తెలిపారు. చిన్న మాదారం మీదుగా కనగల్లు వరకు 15 కోట్ల రూపాయలతో డబల్ రోడ్డుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామని, అంతేకాకుండా ప్రధాన రహదారి కలిసే వరకు మరో 15 కోట్ల రూపాయలుతో ఈ రోడ్డు విస్తరణ చేపడతామని అన్నారు. చిన్న మాదారంలో సబ్ స్టేషన్ ఏర్పాటు వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుందని, అంతేకాక విద్యుత్ సమస్య తీరుతుందన్నారు.

నల్గొండ జిల్లాలోని సాగు భూములన్నిటికీ సాగునీరు అందించేందుకుగాను ఎస్ ఎల్ బి సి సొరంగం పూర్తి చేయడమే తమ లక్ష్యమని, ఇందుకుగాను గత ప్రభుత్వాలతో కొట్లాడి ఎస్ఎల్బీసీ తీసుకురావడం జరిగిందని, అనివార్య కారణాలవల్ల ఆగిపోయిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2200 కోట్లు మంజూరు చేసిందని, సొరంగం తవ్వే మిషన్ మరమత్తుల కారణంగా ఆగిపోగా అమెరిక నుంచి విడిభాగాలు తెప్పించి పనులను ప్రారంభిస్తున్నామని రెండేళ్లలో ఈ సొరంగం పనులు పూర్తవుతాయని మంత్రి తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువ ద్వారా చెరువులను నింపుతామని రైతులు బాగుంటేనే అందరు బాగుంటారని సాగర్ ఆయకట్టు చివరి వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని అన్నారు. జిల్లాలో పూర్తిగా ఫ్లోరైడ్ తుడిచి పెట్టుకుపోవాలని, తాగునీరు ప్రతి ఒక్కరికి అందాలన్నారు. ఇల్లు లేని వారందరికీ గ్రామానికి 50 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నామని రుణమాఫీలో భాగంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు. అంతకుముందు మంత్రి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్న మాదారం ఉన్నత పాఠశాలలో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో భవనానికి కలర్, వేయించడంతోపాటు, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, బాత్రూం, అన్నింటిని మరమ్మత్తు చేయిస్తామని అలాగే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, నల్లాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన ఆర్థిక సాయం ఇస్తామని తెలపడమే కాకుండా తక్షణమే పనులు చేపట్టేందుకు 50 వేల రూపాయల నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందించారు. వీటితోపాటు డైనింగ్ హాల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి పదికి పది జీపీఏ తీసుకురావాలని పాఠశాల గ్రౌండ్ ను చదును చేస్తామన్నారు. చిన్న మాదారం పాఠశాల ఉపరితల మార్చేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ట్రాన్స్కో ఎస్ ఈ బాలరాజు, డి ఈ వెంకటేష్, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవి, విద్యుత్ ఏ ఈ రాజశేఖర్ చారి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం అనుప్ రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, తోరగల్లు మాజీ సర్పంచ్ చిర్రబోయిన యాదయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed