రుణమాఫీ కొందరికే.. 2.14 లక్షల మంది ఎదురుచూపు..!

by Nagam Mallesh |   ( Updated:2024-08-11 03:53:22.0  )
రుణమాఫీ కొందరికే.. 2.14 లక్షల మంది ఎదురుచూపు..!
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ః ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. రైతన్న పరిస్థితులు మాత్రం మారట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన రుణమాఫీ కోసం జిల్లాలో లక్షల మందిరైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలలో రైతు రుణమాఫీ చేసినప్పటికీ అనేక కారణాలతో ఇంకా చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందుతుందని తెలుపుతున్నారు.

మూడో విడతలోనైనా న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే మూడో విడతలో కూడా రుణమాఫీ పొందని వారి నుంచి అందిన ఫిర్యాదుల మేరకు బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా విచారించి గ్రామ కమిటీల ద్వారా రుణమాఫీ సమస్యలను పరిష్కరించనున్నారు. రేషన్ కార్డులు, పీఎం కిసాన్ పథకంలో లేని వారికి ఆదాయపు పన్ను చెల్లింపులే ప్రామాణికంగా కొంతమంది రైతుల పేర్లు రుణమాఫీ పథకంలో నమోదు కావడం లేదు. రేషన్ కార్డులో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు పేర్లు ఉండి, వారసత్వంగా పొందిన భూమికి రుణం తీసుకున్న రైతులకు మాఫీ వర్తించడం లేదు. గతంలో పాస్ పుస్తకం నుంచి ప్రస్తుతం కొత్త పట్టాదారు పాస్ పుస్తకం లేని రైతులకు కూడా రైతు రుణమాఫీ పథకంలో లబ్ధి చేకూరడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకం ద్వారా 2018 డిసెంబర్ 12 నుంచి 23 డిసెంబర్ 9 వరకు బ్యాంకులలో రుణాలు పొందిన రైతులకు రుణమాఫీ ప్రకటించింది. మొదటి విడత జూలై 18న 199.87కోట్లు, రెండో విడత జూలై 30వ తేదీన 165.87 కోట్లు విడుదల చేసింది. మూడో విడతలో 2.14లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు.

ఆందోళనలో రైతులు..

జిల్లా వ్యాప్తంగా ఒకటి, రెండో విడతలలో రుణమాఫీ పొందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు రెండు విడతలలో నిధులు విడుదల కాగా రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు లేకపోవడంతో కొందరు రైతులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రేషన్ కార్డు, పిఎం కిసాన్ పథకం తోపాటు మరో 16 రకాల కారణాలతో రైతు రుణమాఫీ ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ పొందని రైతులు మండల విస్తరణ అధికారిని సంప్రదించి కావాల్సిన ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఫోన్ నెంబర్లు తదితర ధ్రువపత్రాలతో ఫిర్యాదు చేస్తున్నారు. రుణ మాఫీ పొందని రైతులు ఆందోళన చెందుతుండగా మూడో విడతల్లోనైనా లేదా చివరిగా గ్రామ కమిటీల్లోనైనా సమస్యను పరిష్కరించి రుణమాఫీ లబ్ధి పొందేల అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

763 ఫిర్యాదులు స్వీకరణ..

జిల్లా వ్యాప్తంగా 17 మండలాలలో 2,66,881 రైతులు ఉన్నారు. రుణ మాఫీ తొలి విడతలో36,483 మందికి, రెండో విడతలో 16,143 మందితో కలిపి మొత్తంగా52,626 మంది రైతులకు పంట రుణాలు మాఫీ అయ్యాయి. ఇంకా 2,14,255 మంది రైతులు మూడో విడత కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఒకటో విడత, రెండో విడతలలో రుణమాఫీ అందని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు బ్యాంకు, వ్యవసాయ శాఖల అధికారులు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా శుక్రవారం వరకు 763 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ తెలిపారు. టోల్ ఫ్రీ ద్వారా అందిన ఫిర్యాదులను పరిశీలించి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

గ్రామ కమిటీలోనైనా పొందవచ్చు : అనురాధ, డీఏఓ

రైతు రుణమాఫీ పొందని రైతులు చివరకు గ్రామ కమిటీలలో అయినా లబ్ధి పొందవచ్చు. ప్రభుత్వం ఈనెల 15న మూడవ విడత రుణమాఫీ విడుదల చేయనుంది. ఇప్పుడు వరకు మాఫీ పొందని రైతులు మూడో విడతలో లేదంటే గ్రామ కమిటీలు పొందవచ్చు. జిల్లాలో అందిన ఫిర్యాదుల మేరకు పట్టాదారు పాస్ పుస్తకం అప్లోడ్ చేయాలి. తర్వాత హైదరాబాద్ హెడ్ ఆఫీస్ వారు పరిశీలించి రుణమాఫీ కేటాయిస్తారు. కాబట్టి అర్హత కలిగిన ప్రతి రైతు రుణమాఫీ పొందవచ్చు.

Advertisement

Next Story