కలెక్టర్ గారూ.. ఓ కన్నేయండి..

by Shiva |
కలెక్టర్ గారూ.. ఓ కన్నేయండి..
X

చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం, ఎమ్మెల్యే భూమి పూజ

దిశ, చిలుకూరు: 'కాదేదీ కవితకు అనర్హం' అని శ్రీశ్రీ అన్నట్లుగా.. 'కాదేది కబ్జాకు అనర్హమని' మన నాయకులు దానికి వక్ర భాష్యం పలుకుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చిలుకూరు మండల పరిధిలోని పాలె అన్నారం(నారాయణపురం) రెవెన్యూ పరిధిలో సర్వే నెం.807లో సుమారు 180 ఎకరాల మేర ఊర చెరువు విస్తరించి ఉంది. కానీ, ఇప్పటికే దాదాపు 80 ఎకరాల మేర చెరువు ఆక్రమణకు గురైంది. ఎవరైనా ఇళ్లు, కుల సంఘం, కల్యాణ మండపాలు, దేవాలయాలు, క్రీడా మైదానాలు మొదలైనవి నిర్మించుకోవాలంటే స్థలాలు కొనుగోలు చేసి నిర్మించుకుంటారు.

కానీ, మండల పరిధిలో కొందరు అక్రమార్కులు అందుకు భిన్నంగా ప్రభుత్వ భూములు, చెరువు శిఖాలను ఇష్టారీతిన ఆక్రమిస్తున్నారు. నారాయణపురంలోని ఓ కుల సంఘ సభ్యులు తమ సంఘ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా గ్రామంలోని సీతారామపురం - నారాయణపురం రహదారిలోని ఊర చెరువు శిఖంలో ఇటీవల ముగ్గు పోశారు. ఆదివారం సాక్షాత్తూ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేతుల మీదుగానే భూమి పూజ కూడా చేయించారు.

మరి స్థానిక నాయకులు ఈ విషయంలో ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇచ్చారా.. లేక ఆయనకు తెలిసే చెరువు శిఖం భూమిలో నిర్మాణాన్ని పొత్సహించారా అనేది తెలియడం లేదు. ఈ విషయంలో పలువురు గ్రామస్థులు చెరువు ఆక్రమణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణను వెంటనే అడ్డుకోకపోతే తాము కూడా చెరువు శిఖంలోనే ఇతర నిర్మాణాలకు పూనుకుంటామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయమై 'దిశ' సంబంధిత అధికారులను సంప్రదించగా సోమవారం చెరువు సర్వే చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కలెక్టర్ జోక్యం చేసుకోవాలి..

తమ గ్రామంలోని ఊర చెరువును సమగ్ర సర్వే నిర్వహించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కలెక్టర్ ను కోరుతున్నారు. కరవు వస్తే గ్రామాన్ని ఆదుకునేది చెరువేనని, తమకు న్యాయం చేయాలని వారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు విన్నవిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed