కాంగ్రెస్‌ను వీడని వర్గ విభేదాలు.. భట్టి విక్రమార్క ఎదుటే తగువులాట

by Hamsa |
కాంగ్రెస్‌ను వీడని వర్గ విభేదాలు.. భట్టి విక్రమార్క ఎదుటే తగువులాట
X

దిశ, నల్గొండ బ్యూరో: రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎట్లైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఆ పార్టీ సీనియర్ నేతలు ఒకరికి ఒకరు పోటీగా జనంలో ఉంటూ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగడుతున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయగలము వివరిస్తూ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క 49 రోజులుగా వివిధ జిల్లాల్లో పీపుల్స్ మార్చ్ పేరుతో జిల్లాలు మండలాలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం సమయం ఏదైనా.. సందర్భం ఎక్కడైనా... ఏ ప్రదేశం అయినా సరే.. గ్రూపులుగా విడిపోయి ప్రజల మధ్యనే తగువులాడుకోవడం ఆ నేతలకు అలవాటుగా మారింది. దానికి కొనసాగింపుగానే ఆలేరు నియోజకవర్గం లో కొనసాగుతున్న మల్లు పాదయాత్రలో మూడు పంచాయితీలు ఆరు కొట్లాటలుగా సాగుతుంది .

కొలనుపాక నుంచి యాత్ర ప్రారంభం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మే 1వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాకలో ప్రవేశించింది రఘునాథపురం లో ముగిసింది.రెండో తేదీన రఘునాథపురం నుంచి ప్రారంభమైన యాత్ర మాసాయిపేట మీదుగా యాదగిరిగుట్టలో యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనం అనంతరం భువనగిరి నియోజకవర్గంలో ప్రవేశించి బసవపురంలో సాయంత్రంయాత్ర ముగిసింది. మూడు రోజులుగా యాత్రలో ఆ పార్టీ నేతలు భట్టి విక్రమార్క సమక్షంలోనే గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే వరకు చేరింది. మొదటి రోజున డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు నియోజకవర్గ ఇన్ చార్జి బీర్ల ఐలయ్య ల మధ్య పెద్ద పంచాయితీ అయింది.

యాత్రను స్వాగతిస్తూ ఆహ్వానం పలికే క్రమంలో జిల్లా అధ్యక్షుడు కుంభంకు మైకు ఇవ్వకుండా బీర్ల ఐలయ్య ఆలేరు అంటే నేను నేనంటే ఆలేరు మీరెవరు ఇక్కడ మాట్లాడడానికి అనే పద్ధతిలో డీసీసీ నేతతో గొడవపడ్డాడు. దానికి అవమానంగా భావించిన కుంభం కార్యక్రమంలో పాల్గొని మౌనంగా వెళ్లిపోయారు. రెండో రోజు దూది వెంకటాపురం గ్రామంలో ఆ జిల్లా నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి ప్రచార రథం మీదికి ఎక్కబోతుంటే బీర్ల వర్గం నేతలు పైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడ ఒకరు ఒకరు కొట్టుకునే దాక వచ్చింది పరిస్థితి. మూడోరోజు యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో నిరుపేదలైన కొంతమందికి కల్లూరు రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో ఉచితంగా ఇల్లు నిర్మించారు.

ఆ ఇళ్ళను ప్రారంభించాలని సీఎల్పి నేత భట్టి విక్రమార్క కల్లూరి విజ్ఞప్తి చేయగా ఆయన ఒప్పుకున్నారు కానీ ఆ ఇండ్లను ప్రారంభిస్తే తన పరువు పోతుందని ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని విక్రమార్కను కాళ్లు పట్టుకునేంత పనిచేసినట్టు సమాచారం. దాంతో ఆయన వెళ్లకుండా జెడ్పీటీసీ కుడుదుల నగేష్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభారాణి ఇతర నేతలతో ఆ ఇళ్ళను ప్రారంభించాలని పురమాయించారు. అప్పుడు కల్లూరి వర్గం నేతలు ఎంత పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తున్న వారికి సపోర్ట్ చేయకుండా కొంతమందికే ఎందుకు అండగా ఉంటున్నారని వారు ప్రశ్నిస్తూ పాదయాత్రకు కొంత దూరంగా ఉన్నట్టు సమాచారం. మొత్తంగా ఈ నియోజకవర్గంలో సాగిన మూడు రోజుల పర్యటన నేతల మధ్య పంచాయితీలే నడిచాయి

డబ్బులు పంచి జనం తరలింపు

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు జనం నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఆ నియోజకవర్గ నేతలు బీర్ల ఐలయ్య ఒక వర్గంగా మాజీ ఎమ్మెల్యే కొడుదుల నగేష్. పార్టీ నేతలు కల్లూరు రామచంద్రారెడ్డి .అయోధ్య రెడ్డి. సంజీవరెడ్డి .బండ్రు శోభారాణి తదితర నేతలంతా ఒక వర్గంగా కొనసాగుతున్నారు. యాత్రలో ఈ నేతలంతా ఒకరిపై ఒకరు దూషించుకుంటూ గొడవలు చేసుకుంటున్నారు .ఇదే సందర్భంలో నిత్యం కొట్లాటతో గడిపే కాంగ్రెస్ పార్టీ యాత్రలో జనం కూడా విసిగిపోయి ఎవరు పాల్గొనడం లేదని తెలుస్తోంది.యాత్రలో పాల్గొనే జనానికి డబ్బులు పంచి వారిని యాత్రలో భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. రోజువారి కూలిగా ప్రతి ఒక్కరికి 500 రూపాయలు సమాచారం.

యాత్రలో కనిపించని కోమటిరెడ్డి

మూడు రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం లో మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుది. కానీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరోజు కూడా యాత్రలో పాల్గొనలేదు. యాత్రకు ముందు రోజు నుంచి కోమటిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళినట్లు సమాచారం. రెండు నెలల క్రితం పాదయాత్ర పర్యటన ఖరారు అయినప్పటికీ తెలిసి కూడా వెంకటరెడ్డి యాత్రకు దూరంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇతర జిల్లాలలో భట్టి పాదయాత్రకు హాజరై ఆయన దృష్టిలో పెట్టుకొని దళిత సీఎం అంశాన్ని తెర మీదికి తెచ్చిన కోమటిరెడ్డి తీరా ఆయన నియోజకవర్గానికి పాదయాత్ర వచ్చిన తర్వాత హాజరు కాకపోవడం ఆంత్యర్యం ఎంటో అర్థం కావడం లేదు.

మరో నాలుగు రోజులు అయితే ఈ జిల్లాలో యాత్ర పూర్తి అవుతుంది. ఏదైనా సభ నిర్ణయించే ముందు తనకు తెలియకుండా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించే కోమటిరెడ్డి తెలిసిన పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు ఆయనకే తెలియాలి. అనేక గ్రూపులు కలిగిన కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలతో పాదయాత్ర సక్సెస్ కాకుండా చూసేందుకే కోమటిరెడ్డి కావాలని విదేశీ పర్యటనకు వెళ్ళినట్లు చర్చించుకుంటున్నారు. పక్క జిల్లాలకు పోయి జనాన్ని చైతన్యం చేసే కోమటిరెడ్డి ఈ జిల్లాలో జన చైతన్యం కోసం ఎందుకు పర్యటించరు అనే ప్రశ్న కాంగ్రెస్ శ్రేణులను వేధిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed