తెలంగాణలో రానున్నది బహుజన రాజ్యమే : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Sridhar Babu |
తెలంగాణలో రానున్నది బహుజన రాజ్యమే : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, చిట్యాల : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రగతి భవన్ పై ఎగరనున్నది బీఎస్పీ జెండా యేనని, త్వరలోనే తెలంగాణలో బహుజనుల రాజ్యం వస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం చిట్యాల పట్టణ కేంద్రంలో జరిగిన ఆ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీ లో ఆయన పాల్గొన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఎస్పీని చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు వణుకు మొదలైందని, అందుకే ఎప్పుడూ స్మరించని బహుజనుల నినాదం, జై భీమ్ నినాదాలు చేస్తున్నారని, బహుజనుల ఉద్ధరణ కోసం శ్రమించిన మహనీయుల విగ్రహాలను సైతం ఏర్పాటు చేసేందుకు ఆయా పార్టీల నాయకులు ముందుకు వస్తున్నారని అన్నారు.

నల్లగొండ జిల్లాలో అధికార పార్టీకి చెందిన నల్గొండ, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు అక్రమ ఇసుక మాఫియా కు పాల్పడుతూ రూ.3500 కోట్లు కొల్లగొట్టారని, ఈ అక్రమ మైనింగ్ మాఫియా వెనుక మంత్రుల ప్రమేయం ఉండడంతోపాటు సీఎం హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణ పై సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లో ఎన్నో అక్రమాలు, అవినీతి దాగి ఉందన్నారు. పేద ప్రజల అసైన్డ్ భూములను ధరణి పోర్టల్ నుంచి తీసివేసి పేద ప్రజల నోటికాడి బుక్క తీసేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నల్గొండ జిల్లా రైతాంగానికి, ప్రజలకు సాగు, తాగునీరు కల్పించే ఉద్దేశంతో రూ.700 కోట్లతో నిర్మిస్తున్న ఉదయ సముద్రం ప్రాజెక్టు 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా పూర్తి కాకపోవడం వెనుక దాగి ఉన్న మర్మమేమిటో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్​ చేశారు. నల్గొండను దత్తత తీసుకుంటానని పలుమార్లు చెప్పిన కేసీఆర్​కు ఉదయం సముద్రం ప్రాజెక్టు ఎందుకు గుర్తుకు రావడంలేదో తెలియడం లేదన్నారు. ప్రాజెక్టు పూర్తి పై చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు.

ఉదయ సముద్రం ప్రాజెక్ట్ వల్ల నకిరేకల్, నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, మంత్రుల, నాయకుల అవినీతి, దౌర్జన్యాలు, అక్రమాలు నానాటికీ పెట్రేగిపోతున్నాయని, వాటిని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే రాష్ట్ర విద్యుత్ సంస్థ లో భాగమైన ఎన్పీడీసీఎల్ లో పనిచేసే అన్ మైండ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అమానుషమన్నారు. ఎస్పీడీసీఎల్ లో పనిచేసే కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తిస్తున్నప్పటికీ ఎంపీడీసీఎల్ లో పనిచేసే అన్ మైండ్ కార్మికులను గుర్తించకపోవడం బాధాకరమన్నారు.

తమ పార్టీ త్వరలోనే ఎన్పీడీసీఎల్ అన్ మైండ్ కార్మికుల పక్షాన పోరాడుతుందన్నారు. అలాగే తెలంగాణలో గిరిజనుల ఓట్లు దండుకుంటున్న ప్రభుత్వం వారి అభివృద్ధిని పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక గిరిజన యూనివర్సిటీ కావాలని ఎప్పుడూ పార్లమెంటులో అడగకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్, తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్, నకిరేకల్లు నియోజకవర్గ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని, పోకల ఎలిజిబెత్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed