కారుతో ఆటోను ఢీకొట్టిన ఏపీ డీఎస్పీ.. న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న బాధితులు

by Mahesh |
కారుతో ఆటోను ఢీకొట్టిన ఏపీ డీఎస్పీ.. న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న బాధితులు
X

దిశ, నల్లగొండ : ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ఓ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ ఆటోను ఢీకొట్టారు. ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యి..డ్రైవర్ కంటిచూపు కోల్పోయాడు. తాను చేసింది తప్పని తెలిసినా, తన అధికారాన్ని ఉపయోగించి ఇప్పటికీ విచారణకు హాజరు కావడం లేదని, ఆటోను ఢీకొట్టిన కేవలం గంటల వ్యవధిలోనే స్థానిక పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఎండీ గౌస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే సెప్టెంబర్ 26న ఆటో నడుపుతున్నాడు. జిల్లా కేంద్రంలోని నకిరేకల్ రహదారిలోని ఎంజీ యూనివర్సిటీ ఎదుట ఆటో యూటర్న్ తీసుకుంటుండగా.. అదే సమయంలో ఏపీ07బీబీ1458 కారులో అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి ఆటోను ఢీకొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. అదే రోజు నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో, కారు నెంబర్ పైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కనీసం నిందితుడైన పోలీస్ అధికారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల విచారణకు కిరాయి వ్యక్తి..

ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే పోలీసులు పదేపదే ఫోన్ చేసి రావాలని చెప్పినా, ఆయన నుంచి సరైన సమాధానం లేదు. ఫోన్ చేసిన ప్రతిసారి కూడా వారం రోజులు గడువు తీసుకుంటున్నారు. చివరికి తన పోలీస్ బుర్ర ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల జిల్లా పాత చీరాల కు చెందిన గవని ముసలయ్య అనే వ్యక్తిని విచారణకు పంపించారు. కానీ, ప్రమాదానికి కారణమైన కారుకు ఇన్సూరెన్స్ లేదని, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటామని బాధితులు డాక్యుమెంట్స్ అడిగినా స్పందన లేదని, పోలీసులు ఫోన్ చేసినా ఏపీకి చెందిన పోలీస్ అధికారి దురుసుగా మాట్లాడుతున్నారని, ఏం చేసుకుంటారో చేసుకొమ్మని పోలీసులతోనే చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా, స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే అక్కడ ఉన్న సిబ్బంది తమను జోకర్ లాగా చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర పవార్ ను, డీఎస్పీ శివరాం రెడ్డిని కూడా కలిసి న్యాయం చేయాలని కోరినట్లు బాధితులు పేర్కొంటున్నారు. రెండు నెలలు వేచి చూసి ఇదే విషయంపై బాధితులు వీడియో రిలీజ్ చేయగా..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మాకు న్యాయం చేయండి..

నేను ఆటో నడిపితేనే ఇల్లు గడుస్తుంది. పోలీస్ సార్ కారులో అజాగ్రత్తగా వచ్చి నా ఆటోను ఢీకొట్టారు. ఆటో పూర్తిగా నుజ్జవ్వగా, నా కంటి చూపును కోల్పోయాను. ఆ పోలీస్ అధికారికి స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వలేదు. ఈ విషయంపై పోలీసులను అడిగితే స్పష్టం చెప్పడంలేదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.:- ఎండీ గౌస్, బాధిత ఆటో డ్రైవర్, నల్లగొండ

Advertisement

Next Story

Most Viewed