గృహజ్యోతికి అర్హుల ప్రకటన.. అత్యధికంగా తుంగతుర్తి మండలంలో లబ్ధిదారులు

by Shiva |   ( Updated:2024-03-01 03:50:00.0  )
గృహజ్యోతికి అర్హుల ప్రకటన.. అత్యధికంగా తుంగతుర్తి మండలంలో లబ్ధిదారులు
X

దిశ, తుంగతుర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకానికి తుంగతుర్తి, నాగారం విద్యుత్ సబ్ డివిజన్లలో మొత్తం 23,510 నివాస గృహాలను అధికారులు తొలి విడతలో అర్హులైన వారిగా గుర్తించారు. రెండు సబ్ డివిజన్లలో మొత్తంగా 36,432 డొమెస్టిక్ నివాస గృహాలు ఉన్నాయి. అందులో నుంచి 23,510 ఉచితంగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించుకోవడానికి అర్హులు అవుతారని అధికారులు లెక్కలు తేల్చారు. వారికి మార్చి మాసం నుంచి జీరో బిల్లు రాబోతోంది.

ఇది ఇలా ఉంటే 12,922 దరఖాస్తులు వివిధ రకాల కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. తుంగతుర్తి విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి మండలాలు ఉండగా నాగారం సబ్ డివిజన్ కింద తిరుమలగిరి, అర్వపల్లి, నాగారం మండలాలు ఉన్నాయి. మండలాల పరంగా ఉన్న నివాస గృహాలు, అందులో గృహ‌జ్యోతి పథకం కింద ఎంపికైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. తుంగతుర్తి మండలంలో మొత్తంగా 6,866 నివాస గృహాలు ఉండగా అధికారులు 4,684 అర్హమైనవిగా గుర్తించారు.

అదేవిధంగా మద్దిరాల మండలంలో 4,366 కిగాను 3,299, నూతనకల్ మండలంలో 5468‌కి గాను 3635 నివాస గృహాలను అర్హులైనవిగా తేల్చారు. ఇక నాగారం మండలంలో 5,158 కిగాను 3,614, జాజిరెడ్డిగూడెం మండలంలో 5,479‌కి గాను 3,732, తిరుమలగిరి మండలంలో 9095‌కి గాను 4,546 నివాస గృహాలను అర్హులైనవిగా అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే ప్రజా పాలన కార్యక్రమంలో గృహజ్యోతికి సంబంధించిన దరఖాస్తులో తప్పుగా సమాచారం ఇవ్వడం వల్ల అర్హుల్లో కొంతమందికి తొలి విడతలో అవకాశం రాకపోవచ్చని విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాస్ రావు గురువారం ‘దిశ’కు తెలిపారు.

అలాంటి వారు నిరాశ చెందకుండా ఆయా మండలాల ఎంపీడీవోలకు ప్రజా పాలన రసీదుతో పాటు తెలుపు రేషన్ కార్డు, ఆధార్, విద్యుత్ నెంబర్‌తో మళ్లీ గృహ‌జ్యోతి పథకం కింద దరఖాస్తులు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు అక్కడి నుంచి తమకు వచ్చిన దరఖాస్తులపై విచారణ చేసి పథకం అమలులో వారి జాబితాను చేరుస్తామని ఆయన వివరించారు. కాగా, గృహజ్యోతి పథకం కింద నేడో, రేడో సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ కాగానే తమ సిబ్బంది ఇంటింటికి వెళ్లి బిల్లులు తీస్తారని ఆయన వివరించారు.

Advertisement

Next Story

Most Viewed