సంచలనం సృష్టిస్తున్న మైనంపల్లి కామెంట్స్! ఆ జిల్లాపై ఇక స్పెషల్ ఫోకస్

by Rajesh |   ( Updated:2023-02-20 02:43:02.0  )
సంచలనం సృష్టిస్తున్న మైనంపల్లి కామెంట్స్! ఆ జిల్లాపై ఇక స్పెషల్ ఫోకస్
X

దిశ బ్యూరో, సంగారెడ్డి : మెదక్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయం చేసి ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితం అయిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తిరిగి జిల్లాలో రాజకీయం మొదలుపెట్టనున్నారు. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన మెదక్ సెగ్మెంట్‌లో తన కొడుకును రంగంలోకి దింపుతున్నారు. గతంలో నియోజకవర్గంలో చేపట్టిన మైనంపల్లి ట్రస్ట్ సేవలను తిరిగి మొదలుపెట్టనున్నట్లు స్వయంగా ప్రకటించారు.

సేవా కార్యక్రమాలేనని చెబుతున్నప్పటికీ రాజకీయ వ్యూహంతోనే హనుమంతరావు కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ మెదక్‌కు వస్తున్నట్లు అధికార పార్టీలో చర్చలు మొదలయింది. మెదక్ సెగ్మెంట్‌లో అన్ని మండలాల్లో స్కూళ్లు పరిశీలిస్తామని, అక్కడ విద్యార్థుల సమస్యలు తెలుసుకుని మండలానికి ఓ మోడల్ స్కూల్‌ను తీర్చిదిద్దే విదంగా మైనంపల్లి రోహిత్ పని చేస్తారని హనుమంతరావు వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా మెదక్ నుంచి కార్యకర్తలు, సన్నిహితులు ట్రస్ట్ సేవలు పునరుద్ధరించాలని కోరుతున్నారని, వారి అభ్యర్థన మేరకు రోహిత్ ప్రజలకు సేవలందించడానికి వస్తున్నారని హనుమంతరావు చెప్పారు. ఎన్నికల ముందే ఇలాంటి కార్యక్రమం చేపట్టడం వెనుక రాజకీయ కోణం ఉన్నదని చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉండగా ఇప్పటికే మెదక్‌లో ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుబాష్ రెడ్డిలు నువ్వా నేనా..?అన్నట్లుగా రాజకీయంగా చేస్తుండగా వీరిద్దరి మద్యలోకి ఇప్పడు రోహిత్ దిగుతున్నారు. రానున్న రోజుల్లో రాజకీయాలు ఏలా మారున్నాయోనని అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆసక్తి నెలకొన్నది.

1997లో మైనంపల్లి ట్రస్ట్ ఏర్పాటు....

మైనంపల్లి హనుమంతరావుకు మెదక్ జిల్లాతో పరిచయం అక్కరలేదు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్ జిల్లా టీడీపీ పార్టీ బాధ్యతలు చూశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ అద్యక్షుడు చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండేవారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీ నుంచి పని చేస్తున్నారు.

కాగా తాను మెదక్‌లో ఉన్నప్పుడు 1997లో ప్రాంతంలో మైనంపల్లి సేవా సంస్థను ఏర్పాటు చేశారు. తాను ఎమ్మెల్యే కాకముందే సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా మెదక్ ప్రాంతంలో చేపట్టారు. ఓ వైపు రాజకీయం, మరో వైపు సేవకార్యక్రమాలతో స్థానికులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే మెదక్ నియోజకవర్గ ప్రజలు మైనంపల్లి హనుమంతరావును ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మెదక్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంచి సంబందాలున్నాయి.

అయితే తాను మల్కాజ్‌గిరి వెళ్లిపోవడంతో మైనంపల్లి ట్రస్ట్ సేవలు నిలిచిపోయాయి. మైనంపల్లి మెదక్ రావడం కూడా పూర్తిగా తగ్గించుకున్నారు. ఎప్పుడో తన సన్నిహితుల శుభకార్యాలకు అలా వచ్చి ఇలా వెళుతున్నారు. మెదక్‌లో మైనంపల్లి పేరు రాజకీంగా వినిపించుకుండా పోయిందని చెప్పుకోవచ్చు.

ట్రస్ట్ సేవల పేరుతో మళ్లీ అక్కడికి..

ఇంత కాలంగా హైదరాబాద్ నగరానికే పరిమితం అయిన మైనంపల్లి హనుమంతరావు తిరిగి తన రాజకీయ సేవలను మెదక్‌లో మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే మైనంపల్లి ట్రస్ట్ సేవలను మెదక్ సెగ్మెంట్‌లో శివరాత్రి నుంచి మొదలుపెట్టారు. అయితే గతంలో తాను సేవ కార్యక్రమాలు నిర్వహించగా ఇప్పడు మెడిసిన్ పూర్తి చేసిన తన కొడుకును రోహిత్ రంగంలోకి దింపుతున్నారు.

మెదక్‌తో తనకు విడదీయరాని అనుబందం ఉన్నదని, ఇప్పటికీ నాయకులు, కార్యకర్తలు తన వద్దకు వస్తున్నారని మైనంపల్లి చెబుతున్నారు. గతంలో చేపట్టి వదిలిపెట్టిన సేవలను పునరుద్ధరించాలని కార్యకర్తలు ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగానే మైనంపల్లి ట్రస్ట్ సేవలను ఇక పూర్తిగా తన కొడుకు రోహిత్ చూసుకుంటారని హనుమంతరావు వెల్లడించారు.

ఆదివారం మైనంపల్లి హనుమంతరావు ఏడుపాయల దుర్గామాతను దర్శించుకున్నారు. ఇందులో భాగంగానే తన కొడుకు మెదక్‌లో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మీడియా ముందు ప్రకటించారు. మొదటగా స్కూళ్లు పరిశీలించి, అక్కడ పిల్లల సమస్యలు తెలుసుకుని, మండలానికి ఓ స్కూలును మోడల్‌గా తీర్చిదిద్దే విదంగా రోహిత్ ఏర్పాట్లు చేస్తారని, అంతే కాకుండా సంస్థ ద్వారా గతంలో కంటే ఎక్కవ సామాజిక, సేవ కార్యాక్రమాలు చేపడతామని హనుమంతరావు వెల్లడించారు.

ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ.. మధ్యలో రోహిత్..

మెదక్ సెగ్మెంట్లో అధికార పార్టీలో రాజకీయం రసవత్తంగా మారింది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్మే పద్మా దేవెందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలు ఎవరికి వారుగా సీరియస్ రాజకీయాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే బరిలో ఉంటామని స్థానికంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య రాజకీయాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరో వైపు అధికారులు నలిగిపోతుంటే వీరిద్దరి మద్యలోకి ఇప్పుడు రోహిత్ వస్తున్నారు.

ఈ నెల 17 సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిన్నశంకరంపేటలో మైనంపల్లి హనుమంతరావు వర్గం ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించడం చర్చానీయాంశమైంది. మైనంపల్లి మెదక్ వస్తున్నప్పటికీ అటు ఎమ్మెల్యే, మరో వైపు ఎమ్మెల్సీ ఎవరికీ సంబంధం లేకుండానే తనకు తానుగా కొడుకును పరిచయం చేసే కార్యక్రమం పెట్టుకున్నట్లు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలు వేరువేరుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మైనంపల్లి రోహిత్ వర్గం ఏర్పాటు అయ్యింది. మూడు వర్గాలతో మెదక్‌లో అధికార పార్టీ రాజకీయాలు ఎలా మారనున్నాయో చూడాల్సి ఉన్నది.

సేఫ్ సెగ్మెంట్ కావడంతోనే..

అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మెదక్ సేఫ్ సెగ్మెంట్‌గా ఉందని చెప్పుకోవచ్చు. అధికార బీఆర్ఎస్ హవానే ఇక్కడ కొనసాగుతున్నది. ప్రతిపక్ష పార్టీల ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధించనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టి మెదక్ సెగ్మెంట్‌పై పడిందని అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది.

అంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్‌ను వదిలి పెట్టి మైనంపల్లి హనుమంతరావు తన కొడుకును సేవల పేరుతో మెదక్‌కు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మూడు, నాలుగు నెలలో ఎన్నో కార్యక్రమాలు చేపడతామని మైనంపల్లి హనుమంతరావు మీడియా ముందు ప్రకటించడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీతో మైనంపల్లికి సన్నిహిత సంబందాలున్నాయని, అక్కడి నుంచి సంకేతాలు రావడంతోనే కొడుకును మెదక్‌లో రంగంలోకి దింపుతున్నారని ప్రచారం జరుగుతున్నది.

ఇప్పటికే ఇద్దరు నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ పడుతుంటే మూడో వ్యక్తి రంగంలోకి దిగడంపై అధికార పార్టీలో మాత్రం అసలు ఏం జరుతుందనే చర్చ కొనసాగుతున్నది. మైనంపల్లి ట్రస్ట్ వ్యవహారం సేవల వరకే పరిమితం అవుతుందా..? రాజకీయమే ప్రధానంగా తన సేవలను కొనసాగిస్తుందా..? ఈ ట్రస్ట్ సేవలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల రియాక్షన్ ఏంటో వేచి చూడాలి..

Also Read..

హైదరాబాద్ MP అసదుద్దీన్ ఇంటిపై రాళ్ళ దాడి

Advertisement

Next Story

Most Viewed