- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడు ఉపఎన్నికకు ముహూర్తం ఫిక్స్? నోటిఫికేషన్ అప్పుడే?
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉపఎన్నికకు ఈసీ సెప్టెంబర్ రెండో వారంలో షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. అక్టోబరు రెండో వారం తర్వాత ఉప ఎన్నిక నిర్వహించాలని భావిస్తున్నది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబరు మొదటివారం లోగా పూర్తికావాల్సి ఉన్నందున.. కనీసంగా నెల రోజులముందే నోటిఫికేషన్ విడుదల చేయడం అనివార్యమనే ఆలోచనలో ఉన్నది. వీలైతే దానితో పాటే మునుగోడుకు కూడా షెడ్యూలు ఖరారు చేసి నోటిఫికేషన్ జారీచేయడమా లేక దానితో సంబంధం లేకుండా విడిగా నిర్వహించడమా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. హర్యానాలో ఖాళీగా ఉన్న ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ను కూడా మునుగోడుతో కలిపి జరిపే అవకాశం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్‌తో కలిపి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించినట్లయితే షెడ్యూల్ లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
సెప్టెంబరు సెకండ్ వీక్‌లో షెడ్యూలు రిలీజ్ చేయడానికి బదులుగా థర్డ్ వీక్ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ హిమాచల్ ప్రదేశ్‌తో సంబంధం లేకుండా నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంటే వచ్చే నెల రెండో వారంలో ఖరారయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం సెప్టెంబరు రెండో వారంలోనే షెడ్యూలు రిలీజయ్యే అవకాశం ఉందన్న అంచనాతో ఉన్నాయి. షెడ్యూలు విడుదల చేసిన వారానికి నోటిఫికేషన్‌ను జారీ చేసి నెల రోజుల పాటు ప్రచారానికి గడువు ఇచ్చి అక్టోబరు సెకండ్ వీక్ లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఖరారు చేయడానికి ముందు అక్కడి వాతావరణ పరిస్థితులు, చలికాలంలో ఎత్తయిన కొండల్లోని గ్రామాల్లో పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, వీవీ ప్యాట్‌లను తరలించడం, ఎన్నికల సిబ్బంది లాజిస్టిక్ వెసులుబాటు, పలు ఫేజ్‌లలో నిర్వహించాల్సిన ఆవశ్యకత.. తదితర అంశాలన్నింటినీ ఈసీ పరిగణనలోకి తీసుకుంటున్నది.
నవంబరు మొదటి వారంలోగా ఎన్నికల ఫలితాలను విడుదల చేయాల్సి ఉన్నందున వీలైనంత వరకు అక్టోబరు చివరికల్లా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మునుగోడు, హర్యానా సీట్‌కు ఉప ఎన్నికలను హిమాచల్‌ప్రదేశ్‌తో కలిపి నిర్వహించడమా లేక విడిగానా అనేది త్వరలో స్పష్టం కానున్నది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రెండు వారాలు మాత్రమే తేడా ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం పోలింగ్ బూత్‌ల సంఖ్యను నిర్ధారించడంతో పాటు ఉప ఎన్నిక నిర్వహణ ఏర్పాట్లపై దృష్టి ఇప్పటికే సారించింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను రెడీ చేసుకోవడం మొదలు ఫస్ట్ లెవల్, సెకండ్ లెవల్ చెకింగ్‌లను ఎప్పటి నుంచి మొదలు పెట్టాలనేదానిపై ప్రాథమిక యాక్షన్ ప్లాన్ రూపొందించింది. మునుగోడు ఉప ఎన్నికపై మూడు ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.
మూడు పార్టీలు ఒక రౌండ్ బహిరంగసభలను నిర్వహించాయి. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారంలో మునిగిపోయాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి గల్లీ లీడర్లను చేర్చకోవడం తీవ్రం చేశాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న తీరుకు అనుగుణంగానే అభ్యర్థులను ప్రకటించడంపైనా ఇప్పటికే మూడు పార్టీలు ఒక అంచనాకు వచ్చాయి. బీజేపీ తరఫున దాదాపుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఖరారైందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆశావహులతో పైనల్ రౌండ్ సంప్రదింపులు జరిపింది. ఢిల్లీలోని హైకమాండ్ అభ్యర్థిని ఖరారు చేయనున్నందున ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేయాలనే ఏకాభిప్రాయం కుదిరినట్లు ఆశావహులు, రాష్ట్ర నాయకులు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తరఫున నిలబెట్టే అభ్యర్థిపై ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఆ జిల్లా నాయకులతో చర్చలు జరిపారు. షెడ్యూలు విడుదల కాగానే మూడు పార్టీలు అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నాయి.