Munugode by-poll: స్థానిక లీడర్స్‌ జంపింగ్‌లతో మునుగోడులో ఏ పార్టీకి నష్టం చేకూరుస్తారో..?

by Vinod kumar |   ( Updated:2022-10-17 09:48:26.0  )
Munugode by-poll: స్థానిక లీడర్స్‌ జంపింగ్‌లతో మునుగోడులో ఏ పార్టీకి నష్టం చేకూరుస్తారో..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు బైపోల్ స్థానిక ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తుంది. కో అంటే కోట్లు వచ్చిపడుతున్నాయి. దీంతో ఎవరూ ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది పార్టీలు మారుతున్నారు. ఉదయం ఒక పార్టీలో సాయంత్రం మరో పార్టీలో చేరుతున్నారు. వారు ఏ పార్టీలో ఉంటారో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. రాష్ట్రంలోనే మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా, అత్యంత కాస్లీ గా మారింది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రయోగాలు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలకు కాసుల పంట పండిస్తున్నాయి. తమ తమ పార్టీల బలం పెంచుకునేందుకు నాయకులు చేస్తున్న ప్రయోగాలను నాయకులతోపాటు యువకులు సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పార్టీలో యువతను, నాయకులను చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఎవరు వచ్చినా.. ఇంతని ముట్టజెప్పి.. పార్టీ కండువా కప్పేస్తున్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ లు పార్టీలో చేరితో 40 లక్షలు ఇచ్చేవారు. సర్పంచ్, ఎంపీటీసీ అయితే రూ. 5 నుంచి 10 లక్షల వరకు ఇచ్చేవారు. కానీ, ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్ది నేతలకు ప్రజల్లో ఉన్న గుర్తింపును బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ లు పార్టీ కండువా కప్పుకుంటే ఏకంగా రూ. 5 కోట్లు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే సర్పంచ్, ఎంపీటీసీ అయితే చాలు కోటి రూపాయలు ముట్టజెప్పుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ నుంచే ఎక్కువ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రజల్లో తమ పార్టీకి ప్రజాబలం ఉందని చూపించుకోవడానికి నేతలకు గాలం వేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక బరిలో ప్రచారం తోపాటు బేరసారాలు హోరెత్తుతున్నాయి. సమయం దగ్గరపడుతున్న కొద్దీ చోటామోటా నాయకుల కొనుగోళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. నాయకుల హోదాను బట్టి ప్రధాన పార్టీలు ధర నిర్ణయించి వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ముఖ్యంగా యువ నాయకులను ఓటర్లను ఆకర్షించే ప్రక్రియలో నజరానాలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా దక్కించుకోవచ్చని పార్టీలు ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నాయి. సభలు, సమావేశాలకు వస్తే 500 నుంచి వెయ్యి రూపాయలు ఇస్తుండగా, పార్టీలో చేరే యువకుడికి ఒక్కంటికి రూ.10 వేలు, ఇంకో నలుగురిని తీసుకొస్తే మరో రూ. 50 వేలు నజరానాగా పంచుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. పోటాపోటీని అదనుగా తీసుకుని.. కొందరు ఛోటా నాయకులు రోజుకో పార్టీ మారుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పార్టీ కండువా కప్పుకుని.. మారితే ఇంకా ఎక్కువిస్తారా అని అవతలి పార్టీతో బేరమాడుతుండటం గమనార్హం.

వార్డు సభ్యులు, గ్రామంలోని కీలక నాయకుల చేతుల్లో 50 లేదా 100 ఓట్లుంటే చాలు రూ. 50 వేల నుంచి లక్షకు పైగా నగదు ముట్టజెబుతున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లిన వారికి నచ్చజెప్పి.. నజరానాలిచ్చి వెనక్కి తెచ్చుకుంటున్నారు. ఇందులో టీఆర్ఎస్ అగ్రగామీగా నిలిచింది. ప్రతి రోజూ యువత నుంచి వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఇలా అందరినీ గులాబీ గూటికీ చేర్చుతున్నారు. చేరినవారికి నజరానాలతోపాటు అభివృద్ధికి నిధులు, రోజువారి ఖర్చులు సైతం ఇస్తున్నారని విశ్వసనీయ సమాచారం. గ్రామాభివృద్ధికి అని ఎన్నుకున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రోజుకోపార్టీ మారుతుండటంతో ఎవరు ఏపార్టీయో తెలియక ప్రజలు గంధరగోళానికి గురవుతున్నారు. జంపింగ్‌లతో మునుగోడులో ఏ పార్టీకి నష్టం చేకూరుస్తారో..? ఎవరికి ప్రజలు పట్టం కడతారో చూడాలి.

ఇవి కూడా చదవండి : బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్.. చేరికకు ముహూర్తం ఖరారు!

Advertisement

Next Story