నడుస్తున్న బస్సులో తల్లీకూతుళ్ల చేతివాటం.. ఏం చేశారో తెలిస్తే షాక్

by Rajesh |
నడుస్తున్న బస్సులో తల్లీకూతుళ్ల చేతివాటం.. ఏం చేశారో తెలిస్తే షాక్
X

దిశ, భిక్కనూరు : బస్సు ఎక్కిన ఇద్దరు తల్లీ కూతుళ్లు ప్రయాణికుల నుంచి చాకచక్యంగా జేబుల్లో నుంచి డబ్బులు కొట్టేసి పోలీసులకు చిక్కిన వైనం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులోని హైవేపై వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్లి శుక్రవారం రాత్రి తిరిగి వస్తుండగా భిక్కనూరు బస్టాండ్ వద్దకు వచ్చి ఆగింది. బస్సు కండక్టర్ రాచర్ల నారాయణ తన ప్యాంటు వెనక పాకెట్ జేబులో పెట్టుకున్న రూ. 6640 రూపాయలు నగదు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కూర్చున్న చోట పైనా కింద అంతటా వెతికినా డబ్బులు కనిపించలేదు. అప్పటికే బస్సు టోల్ ప్లాజా దాటి జంగంపల్లి శివారులోని హైవేకు చేరుకుంది.

డబ్బులు పోయాయని అరుపులు కేకలు పెట్టాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ప్యాసింజర్లు జేబులు చెక్ చేసుకోగా రూ. 3 వేల రూపాయలు పోయాయని ఒకరు,రూ. 5500 రూపాయలు పోయాయని మరొకరు చెప్పడంతో, వెంటనే బాధితులు డయల్‌ 100కు కాల్ చేశారు. స్థానిక భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు ఈ సమాచారం అందడంతో పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే బస్సును పక్కకు ఆపి స్థానిక పోలీసులు బస్సులో ప్రయాణిస్తున్న వారిని చెక్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు తల్లీ బొంతల లక్ష్మీ, ఆమె కూతురు సిరి గారి కవిత మహిళా పోలీసులు చెక్ చేశారు.

ప్రయాణికుల నుంచి కొట్టేసిన రూ. 15 వేల 100 రూపాయల నగదును రికవరీ చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌కు చెందిన వీరు వారం రోజుల క్రితం కామారెడ్డి వచ్చి ఇంటిని అద్దెకు తీసుకొని ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.



Next Story