Harish Rao : మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు పెండింగ్‌లోనే : హరీష్ రావు

by Ramesh N |
Harish Rao : మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు పెండింగ్‌లోనే : హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న 776 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. వీరితోపాటు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేస్తున్న దాదాపు 3747 మంది టీచింగ్ స్టాఫ్ (పార్ట్‌టైమ్ & ఐసీటీ) టీచర్లు, 900 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా రెండు నెలల నుంచి జీతాలు అందడం లేదన్నారు.

ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగస్తులకు జీతాలు చెల్లిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వాస్తవానికి మాత్రం నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెట్టి ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు. అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా, వేతనాలు ఇవ్వమని ప్రభుత్వాన్ని వేడుకున్నా, పట్టించుకునే వారే లేరని వెల్లడించారు. సకాలంలో జీతాలు అందక, కుటుంబ పోషణ కోసం ఇబ్బందులు పడుతున్న ఉద్యోగస్తులను ప్రభుత్వం కనికరించడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పార్ట్‌టైమ్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా రెగ్యులర్ ఉద్యోగులతో పాటే వేతనాలు చెల్లించి, పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed