- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పెషల్ ఫండ్స్ విడుదలలో వివక్ష.. హైకోర్టులో దుబ్బాక ఎమ్మెల్యే పిటిషన్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ డెవలప్‌మెంట్ నిధుల మంజూరులో వివక్ష పాటిస్తున్నదని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లకే ప్రాధాన్యత ఇస్తున్నదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉద్దేశపూర్వకంగానే ప్రత్యర్థి పార్టీల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నదని, నిధులను విడుదల చేయకుండా వివక్ష ప్రదర్శిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట సెగ్మెంట్లకు మాత్రమే స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి వివక్షను ప్రదర్శించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 స్ఫూర్తికి విరుద్ధమైనదని ప్రస్తావించారు.
ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయిందన్న ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధుల్ని మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేయాలని ఆ పిటిషన్‌లో రఘునందన్‌రావు కోరారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2019-20 వరకు దుబ్బాక నియోజకవర్గానికి రూ. 136.75 కోట్ల మేర ఎస్డీఎఫ్ నిధులు మంజూరైతే అందులో రూ. 95.09 కోట్లు విడుదలయ్యాయని, చివరకు రూ. 80.80 కోట్లతో సుమారు 800 రకాల పనులు పూర్తయ్యాయన్నారు. కానీ తాను ఎమ్మెల్యేగా (బీజేపీ తరఫున) గెలిచిన మూడేళ్ళలో ఒక్క పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని ఆ పిటిషన్‌లో వివరించారు. ఈ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు మాత్రం వందలాది కోట్ల రూపాయలను ఎస్డీఎఫ్ పేరుతో విడుదల చేసిందని వివరించారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు నిధులను ఎస్డీఎఫ్ పేరుతో ప్రభుత్వం విడుదల చేస్తూ ఉన్నదని, దుబ్బాక సెగ్మెంట్‌లో జిల్లా పరిషత్ స్కూలు భవనాల నిర్మాణం, పలు స్కూళ్ళకు ప్రహరీ గోడలు, కమ్యూనిటీ హాళ్ళు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితరాలకు నిధులు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ మొదలు ముఖ్యమంత్రి వరకు ఎన్ని లేఖలు రాసినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ఫలితంగా ప్రజల కనీస అవసరాలను తీర్చలేకపోతున్నానని, ప్రజా ప్రతినిధిగా తనపు ఉన్న బాద్యతను నిర్వర్తించలేకపోతున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష కారణంగా నియోజకవర్గ ప్రజలకు సౌకర్యాలు అందకుండా పోయిందని, రాజకీయ కోణం నుంచే ఈ పక్షపాత ధోరణికి ప్రభుత్వం పాల్పడుతున్నదని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎస్డీఎఫ్ పేరుతో దుబ్బాక నియోజకవర్గానికి సైతం నిధుల్ని విడుదల చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ అర్హతపై సోమవారం హైకోర్టు విచారణ జరపనున్నది.
దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలి: అసదుద్దీన్‌కు MP బండి సంజయ్ సవాల్