Uttam Kumar Reddy : నిజాం సాగర్ రిజర్వాయర్ నీటి విడుదల చేసిన మంత్రి ఉత్తమ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-13 08:09:24.0  )
Uttam Kumar Reddy : నిజాం సాగర్ రిజర్వాయర్ నీటి విడుదల చేసిన మంత్రి ఉత్తమ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్(Nizam Sagar reservoir)నుంచి ఆయకట్టు రైతులకు రబీ పంట సాగు కోసం నీటిని విడుదల(releases water)చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంత్ రావు, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. దేశ చరిత్రలోనే వందేళ్ల చరిత్ర గల ప్రాజెక్ట్ నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యమన్నారు. రైతులు పొదుపుతో నీటిని వాడుకోవాలని, ఆన్ ఆఫ్ మోడ్‌లో సాగు నీళ్లను అందిస్తామన్నారు. నాగ మడుగు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లెండి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్ల అప్పు చేసి ఇరిగేషన్ మీద ఖర్చు చేసినప్పటికి పాలమూరు, సీతారాం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల నుంచి ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్‌లు కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం తాము రూ.22500 కోట్లను ఇరిగేషన్ మీద ఖర్చు పెడుతున్నామన్నారు. జాతీయ నీటి సంఘం ఇచ్చిన ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న మూడు బ్యారేజ్‌లలో నీళ్లను తాము వినియోగించలేమని చెప్పారు. కాళేశ్వరం నీటిని సముద్రంలో వదిలేశామని తెలిపారు. కాళేశ్వరం నీళ్లను వాడకుండా ఈ ఏడాది అత్యధికంగా దేశంలోనే వరి దిగుబడిని సాధించామన్నారు. రికార్డు స్థాయిలో పండించిన పంటలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొన్నామని గుర్తుచేశారు. ఈ ఐదేళ్ల పాటు రైతులు పండించిన సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సుకు ఇప్పటి వరకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చామని, త్వరలో ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed