దేశంలో ఇంతకంటే పెద్ద స్కామ్ లేదు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
దేశంలో ఇంతకంటే పెద్ద స్కామ్ లేదు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ ప్రాజెక్ట్ పెద్ద స్కామ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత దేశంలో ఇంతపెద్ద స్కామ్ ఎక్కడా జరుగలేదని చెప్పారు. మంగళవారం మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను సీఎం సహా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ అధికారంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టుకు అసలు పునాదే బలంగా లేదని అన్నారు. మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే మరో 40 వేల కోట్లు కావాలని చెప్పారు. మనల్ని, మన పిల్లల్ని తాకట్టు పెట్టి 64 వేల కోట్లు ఖర్చు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర పన్నుల నుంచి వచ్చిన ఆదాయం నుంచి మరో 30 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కేసీఆర్ చేసిన పనులు చూసి పిచ్చి తుగ్లక్ కూడా సిగ్గుపడుతారని ఎద్దేవా చేశారు. 14 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదని మండిపడ్డారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్మాణంలోలోపం జరిగిందని నివేదిక ఇచ్చాని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎవరినీ వదలిపెట్టమని హెచ్చరించారు. క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు.

Advertisement

Next Story