ఒక ఆడబిడ్డపైన మీ ప్రతాపమా?.. ఈడీ అధికారులపై మంత్రి సీరియస్

by GSrikanth |   ( Updated:2023-03-21 10:01:55.0  )
ఒక ఆడబిడ్డపైన మీ ప్రతాపమా?.. ఈడీ అధికారులపై మంత్రి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సోమవారం ఫోన్లు అడిగితే.. మంగళవారం ఓ లేఖ ద్వారా ఈడీకి సమర్పించిందని అన్నారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకరిమీద ఆరోపణలు చేసేటప్పుడు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించారు. ఒక ఆడబిడ్డ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా.. అసభ్యకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే ఈ అంశంపై ఢిల్లీలో ఇద్దరు బీజేపీ ఎంపీలు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కవితపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దీనిని దేశ ప్రజలు గమనించాలని కోరారు.

వేల కోట్లు కొల్లగొట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా, అదానీ వ్యవహారాలను పక్కనబెట్టి.. ఒక ఆడబిడ్డపైన మీ ప్రతాపమా? అని తీవ్రంగా స్పందించారు. అసలైన దొంగలను వదిలేసి.. పది నెలలుగా ఒక ఆడబిడ్డను వేధిస్తున్నారని అన్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తోందని, గంటలు గంటలు కూర్చోబెట్టి అధికారులు పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రజాస్వామ్య శక్తులంతా ఏకం కావాలని, సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ‘బెదిరింపులకు భయపడేది లేదు. మీకు లొంగం. దేశం అంటే కేసీఆర్‌కు ప్రాణం. రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డపై పుట్టిన పులి బిడ్డ ఎమ్మెల్సీ కవిత.’ ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Also Read: TSPSC పేపర్ల లీక్ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed