నేను దేశ ప్రజలకు గులాముని : కిషన్ రెడ్డి

by Kalyani |
నేను దేశ ప్రజలకు గులాముని : కిషన్ రెడ్డి
X

దిశ, తుర్కయంజాల్ : నేను దేశ ప్రజలకు గులాం, నకిలీ గాంధీ లకు గులామును కానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని వేద కన్వెన్షన్ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ పార్టీ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… నేను ఎవ్వరికీ గులామును కానని, భారత దేశ ప్రజలకు మాత్రమే గులాం అని, సీఎం రేవంత్ రెడ్డి ఇటలీ దేశానికి, నకిలీ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి గులాం గిరి అని అన్నారు. తెలంగాణను కాపాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, స్వతంత్ర సంగ్రామంలో పోరాడిన ప్రతి ఒక్కరికి నేను గులాంనేనని పేర్కొన్నారు. సమస్యల పై ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి జవాబు చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలు మరిచిపోయే విధంగా మూసీ ప్రక్షాళన పేరును ముందుకు తీసుకొచ్చిందన్నారు. మేము మూసీ కి వ్యతిరేకం కాదని, నిరుపేద ప్రజల ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో కూల్చి ఇబ్బందుల గురి చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా రైతు రుణమాఫీ అమలుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విద్యా భరోసా కింద విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తానని, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలను ఇస్తామని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. వృద్ధులకు, వితంతు, వికలాంగులకు పింఛన్లు పెంచుతామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు.

అనంతరం మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణలు మాట్లాడుతూ… ఆరు గ్యారంటీల పేర్లతో ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాడితే కాంగ్రెస్ పార్టీ బురద చల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి , ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, రాష్ట్ర ఎన్నికల క్రమశిక్షణ కమిటీ సభ్యులు బోసుపల్లి ప్రతాప్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కోశాధికారి బచ్చిగల్ల రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు కొండ్రు పురుషోత్తం, దయానంద్ గౌడ్, కరాడి శ్రీలత అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story