అసలు ఆ మాటలు కేటీఆర్ నోటికి ఎలా వచ్చాయి?.. సీతక్క సీరియస్

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-15 16:14:19.0  )
అసలు ఆ మాటలు కేటీఆర్ నోటికి ఎలా వచ్చాయి?.. సీతక్క సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తక్షణమే తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం ‘మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనం’ అని మండిపడ్డారు. ‘మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్? గుమ్మడికాయ దొంగలు ఎవరు? అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఆలోచన మీకు రాలేదు.. మేము చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదని అన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్‌లు, రికార్డింగ్ డాన్స్‌లు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృథా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి అని, ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే.. వారిని బ్రేక్ డాన్సులు వేసుకోమనడం దుర్మార్గమని అన్నారు. మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయని, మహిళలు పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండించారు. కేటీఆర్ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకొండి అనే ధైర్యం ఎలా వచ్చిందని నిలదీశారు. తక్షణమే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.

Advertisement

Next Story