గణేష్ నవరాత్రి ఉత్సవాలపై సమీక్ష.. నిర్వాహకులకు మంత్రి పొన్నం కీలక హెచ్చరిక

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-27 15:40:58.0  )
గణేష్ నవరాత్రి ఉత్సవాలపై సమీక్ష.. నిర్వాహకులకు మంత్రి పొన్నం కీలక హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: జంట నగరాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలపై నిర్వాహకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. మండపాల వద్ద ఏర్పాట్లతో పాటు ప్రజలు తీసుకుంటున్న చర్యలపైనా దృష్టి పెట్టాలని అన్నారు. గతంలో రంజాన్, మొహర్రం, బోనాలు విజవంతంగా జరుపుకున్నాం.. ఇప్పుడు 11 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్, బాలాపూర్ ఉత్సవ కమిటీలకు అన్ని రకాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ 11 రోజుల పాటు జీహెచ్‌ఎంసీ, పోలీస్, విద్యుత్, ఫైర్, రవాణా శాఖ, మెట్రో ఇతర విభాగాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. మెట్రో వేళలు సైతం పొడిగిస్తారని అన్నారు. రోడ్లపై మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రేన్‌లకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. నిమజ్జనంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 40 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి.. ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని సూచించారు.

Advertisement

Next Story