Minister Ponnam: నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలి

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-08 15:51:19.0  )
Minister Ponnam: నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు కులగణన తప్పనిసరి కావడంతో వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్తగా బీసీ కమిషన్ ఏర్పాటైన వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన కసరత్తుపై రివ్యూ జరిగింది. దాదాపు నెల రోజులు కావస్తున్నా ఆ కార్యాచరణ ప్రారంభం కాకపోవడంతో దృష్టి పెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో మంగళవారం సమీక్షించారు. నిర్దిష్ట డెడ్‌లైన్ పెట్టుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన మంత్రి నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కులగణన చేపట్టడానికి అనుసరించిన విధానాలపైనా ఈ సమావేశంలో స్టేట్ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు, వివిధ శాఖల అధికారులతో మంత్రి లోతుగా చర్చించారు. ఇప్పటికే కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు, బీసీ కమిషన్‌లు రూపొందించిన మార్గదర్శకాలను తెలంగాణ స్టేట్ బీసీ కమిషన్ అధ్యయనం చేసింది. ఈ మూడింటిలోని అనుకూల, ప్రతికూల అంశాలతో పాటు తెలంగాణకు ఏ పాలసీ అనువైనదిగా ఉంటుందో మంత్రి ఆరా తీశారు. ఈ మూడు రాష్ట్రాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమమైన పాలసీని రూపొందించాలని ఆదేశించారు.

కులగణనపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. కులగణనపై కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలోనూ, బీసీ డిక్లరేషన్‌లోనూ స్పష్టమైన హామీ ఇచ్చిందని, దానికి తగిన యాక్షన్ ప్లాన్‌పైనా స్పష్టమైన అవగాహన ఉన్నదని, అందులో భాగమే కొత్త బీసీ కమిషన్ ఏర్పాటుతో పాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన చేసిన అధ్యయనం అని వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో పాటు కేబినెట్‌లో కూడా విధాన నిర్ణయం తీసుకున్నదని మంత్రి గుర్తుచేశారు. కర్ణాటకలో బీసీ కమిషన్ కులగణన సర్వే చేయగా, బీహార్‌లో సాధారణ పరిపాలన శాఖ చేసిందని, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ శాఖ చేసిందని తెలిపారు. అక్కడ అనుసరించిన విధానాలపైనా తెలంగాణ బీసీ కమిషన్ స్వయంగా అక్కడ పర్యటించి వివరాలను స్టడీ చేసిందన్నారు. అక్కడ డోర్ టూ డోర్ సర్వేలో పూర్తి స్థాయిలో జనాభా వివరాలను సేకరించినట్లు అధికారులు అందించిన వివరాలను మంత్రి ప్రస్తావించారు. ఈ మూడు రాష్ట్రాల్లో చేసిన బెస్ట్ పాలసీని తీసుకొని తెలంగాణలో అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు ఆగస్టు 1న వెలువరించిన తీర్పును సైతం అమలు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ను ఖరారు చేయడానికి ఉపయోగపడేలా చేపట్టనున్న కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణ అమలుకు కూడా ఉపయోగపడుతుందని, ఆ గణాంకాలను దీనికి కూడా వర్తింపజేయాలన్న ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిందని, ఇప్పటికి మూడు సమావేశాలు జరిగాయన్నారు. కులగణన సర్వే నివేదికలో ఎస్సీ వర్గీకరణకు పనికొచ్చే వివరాలు కూడా ఉంటాయని, ఈ డాటాను విశ్లేషించడానికి సెస్ (సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్) సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. కులగణనలో కులాలవారీ జనాభా లెక్కల ప్రక్రియ కీలకమైనది కావడంతో సమర్ధవంతంగా నిర్వహించడంపైనా, తగిన శిక్షణ ఇవ్వడంపైనా, ప్రశ్నావళి రూపొందించడంపైనా కసరత్తు జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. రె,డు మూడు రోజుల్లో ప్రభుత్వం వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమావేశంలో నిర్ణయం జరుగుతుందని పేర్కొన్నారు.

కులగణన సర్వే, వివరాల సేకరణ, రూపొందించే నివేదిక పారదర్శకంగా ఉండడానికి ఏ విభాగంతో నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో వేర్వేరు శాఖలతో కులగణన జరిగినందున తెలంగాణలో ఏ శాఖ/విభాగం ద్వారా జరిపించాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న సమావేశంలో ఖరారు చేస్తుందన్నారు. జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ), రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితరాలు తమ పరిశీలనలో ఉన్నాయన్నారు. ఒకసారి కులగణన ప్రారంభమైతే నెల రోజుల వ్యవధిలోనే కంప్లీట్ అయ్యేలా ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తుందని, ఈ లక్ష్యం సాకారం కావడానికి సీనియర్ ఐఏఎస్ అధికారికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పజెప్పనున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, బీసీ కమిషనర్ బాల మాయాదేవి, లా సెక్రటరీ, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed