Minister Ponnam: లైసెన్సులు రద్దు చేయడమే కాదు జైలు శిక్ష కూడా ఖాయం

by Gantepaka Srikanth |
Minister Ponnam: లైసెన్సులు రద్దు చేయడమే కాదు జైలు శిక్ష కూడా ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: జిల్లాల కలెక్టర్ల(District Collectors)తో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారి భద్రత(Road Safety) మాసోత్సవాలలో భాగంగా తెలంగాణలో గ్రామగ్రామాన రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మరణిస్తున్నారని దానిని పూర్తిగా తగ్గించడానికి అందరూ కలిసి పని చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి కారణాలవల్ల 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు నిబంధన ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దు చేయడమే కాదు.. జైలు శిక్ష విధించబడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు.

జిల్లాల్లో అవగాహన సదస్సులు, సెమినార్లు, వర్క్ షాప్‌లు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కాలేజీలు, గురుకుల విద్యాసంస్థలు, వృత్తి శిక్షణ సంస్థల్లో ప్రత్యేక అవగాహన ప్రత్యేక కార్యక్రమాలు చేయాలన్నారు. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, డీఈవోలు, పంచాయతీ రాజ్ అధికారులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed