పార్లమెంట్ లో బీసీ బిల్లుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఆర్.కృష్ణయ్య

by Aamani |
పార్లమెంట్ లో బీసీ బిల్లుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఆర్.కృష్ణయ్య
X

దిశ, హిమాయత్ నగర్ : పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బోను దుర్గా నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. బీసీల అభివృద్ధికి విద్యా అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలన్నారు. ప్రత్యకంగా కేంద్ర స్థాయిలో స్కాలర్ షిప్ లు, ఫీజు రియంబర్స్ మెంట్, ఉపాధి రంగంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 20 నుంచి 40 శాతంకు పెంచాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా ఎంపికైన బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకొని రావాలని కోరారు. సీఎం చంద్రబాబు బీసీల పక్షాన నిలబడి బీసీ బిల్లు పెట్టిస్తే చరిత్రలో నిలుస్తారని అభిప్రాయ పడ్డారు. ఈ సమావేశంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చింత శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు భీమవరపు హేమ, మెండు జ్యోతి, వనమాల శ్రీనివాస్, గజేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Next Story