Minister Ponnam Prabhakar: బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తావా..? పొన్నం సవాల్

by Satheesh |
Minister Ponnam Prabhakar: బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తావా..? పొన్నం సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: కేవలం 30 శాతం మందికే ప్రభుత్వం రుణమాఫీ చేసిందని.. మిగిలిన 70 శాతం మందికి మాఫీ చేయకుండానే కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుదన్న కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించడం లేదంటున్న బండి సంజయ్.. అది నిరూపించకపోతే నీ కేంద్ర మంత్రి పదవీకి రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. తక్షణమే బండి సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే భరించలేకపోతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసింది మీరు కాదా అని నిలదీశారు.

రైతులకు ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ జరుగుతుంటే ప్రశంసించాల్సింది పోయి విమర్శలా అని నిప్పులు చెరిగారు. దేశంలోనే ఒక రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వమం మాత్రమేనని, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ స్థాయిలో రుణమాఫీ అమలు చేశారా అని ప్రశ్నించారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన గుజరాత్ రైతులకు వందల కోట్లు కేటాయించిన మీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పంటలు నామా రూపాలు లేకుండా కొట్టుకుపోతే కనీసం ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా అని ప్రశ్నల వర్షం కురింపించారు. ఆగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

రుణమాఫీపై కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉందని విమర్శలు గుప్పించారు. రైతులకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతుంటుంటే సమర్థించాల్సింది పోయి.. విమర్శిస్తున్నారంటే మీ కుహనా బుద్ధి అర్థం అవుతుందని మండిపడ్డారు. మీరు కేంద్రం నుండి రాష్ట్రానికి ఏం తెస్తారో చెప్పండి.. రైతులకు ఏం తెస్తారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యవహార శైలి చూస్తుంటే గురివింద గింజ నలుపెరుగదు అనే సామెతను గుర్తు చేస్తుంది. రైతులకు జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రశంసించే ప్రయత్నం చేయండి.. అంతే తప్ప రైతులకు సంబంధించిన ఈ మంచి కార్యక్రమాన్ని విమర్శించే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed