విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పదు

by Sridhar Babu |
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పదు
X

దిశ, కొత్తగూడెం రూరల్ : అధికారులు విధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన కొత్తగూడెం జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం చుంచుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వేటు తప్పదని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంతో పాటు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలుంటాయన్నారు. పలు శాఖల అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయని, అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

సీఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులు నిర్వీర్యం అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వాటిని మంచి పనులకు వినియోగించాలని, లేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో జరిగే రోడ్డు అభివృద్ధి పనులకు అటవీ శాఖ నుంచి అవసరమైన అనుమతులను పొంది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈఈలకు సూచించారు. గ్రామాల్లో పనిచేసే వంచాయతీ సెక్రటరీలు నివాసం ఓ చోట విధులు మరో చోట ఉండటంతో ఆయా గ్రామాల్లో వారికి పట్టు ఉండటం లేదని, వెంటనే పనిచేస్తున్న చోటే నివాసం ఉండాలని సూచించారు. వారిపై డీపీఓ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో వీధిలైట్లు, మంచినీరు ఇతరత్రా సమస్యలేవీ లేకుండా చూడాలన్నారు.

అలాగే జిల్లాలోని పలు మండలాల్లో ఎమ్మార్పోలపై వరుస ఫిర్యాదులందుతున్నాయని తెలిపారు. ఎమ్మార్వోలను పర్యవేక్షించే బాధ్యత ఆర్డీఓ లదేనని సూచించారు. వారి పనితీరు ఎప్పటికప్పుడు తనకు అప్ డేట్ చేస్తూ ఉండాలని సూచించారు. వాటి ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో మెరుగైన పనితీరు కోసం ఒక్కరికే రూ.50 లక్షలు, ఆపై టెండర్లు ఇవ్వాలన్నారు. తద్వారా అతని పై ఒత్తిడి పెంచి పనిని త్వరగా పూర్తి చేయించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలని, ఆకస్మిక తనిఖీ చేస్తానని అన్నారు. పరిపాలన సజావుగా సాగేందుకు లోకల్ బాడీస్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story