Ponguleti Srinivas Reddy: స్కూళ్లకు సెలవులపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

by Prasad Jukanti |
Ponguleti Srinivas Reddy:  స్కూళ్లకు సెలవులపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితిని గురించి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష సూచన, స్థానిక పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలన్నారు. గత రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినపప్పటికీ వీలైనంత మట్టుకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed