- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా తెలంగాణ.. మంత్రి కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా మారిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్మా రంగ ప్రగతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్కును సుల్తాన్పూర్ లో ఏర్పాటు చేశామని తెలిపారు. టీహబ్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐటీ మరియు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూనిట్ తెలంగాణలో ఉన్నదని వెల్లడించారు. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఇప్పుడే మొదలైందన్నారు.
ఒక్క పెట్టుబడిని రాష్ట్రానికి తేవాలంటే ఎంతగానో కష్టపడాల్సి ఉంటుందని, దేశ విదేశాల నుంచి రాష్ట్రాల వరకు పోటీపడి మరీ పెట్టుబడులను రప్పించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటన చేస్తామని తెలిపారు. 2014లో ఉన్న ఐటీ ఎగుమతులు 57 వేల కోట్ల నుంచి 2.41 లక్షల కోట్లుకు చేరాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 9ఏళ్లలో 1.83లక్షల కోట్ల ఎగుమతులు పెరిగాయన్నారు. సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్యత తెలంగాణ మోడల్ అన్నారు. ఒకవైపు పారిశ్రామిక ప్రగతితో పాటు ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే లక్ష్యమన్నారు. 3.17లక్షలతో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం కలిగి ఉందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ 2014 లో ఉన్న 5లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం 13.27లక్షల కోట్లకు చేరిందన్నారు. ఐటీ రంగం నుంచి మొదలుకొని వ్యవసాయ రంగం దాకా అన్ని రంగాల్లోనూ తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తుందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందరి ప్రగతికి పాటుపడుతున్నదని స్పష్టం చేశారు. 2014లో జరిగిన సమావేశంలో ఇన్నోవేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన మేరకు నేడు దేశంలోనే అతిపెద్ద టీ హబ్, టీ వర్క్స్ ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీపడి పెట్టుబడులు రప్పించాలంటే భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు ప్రపంచంలోనే సింగిల్ లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మసిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచంలోనే సగానికి పైగా వ్యాక్సిన్లు, హైదరాబాద్లో తయారు అవుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి అద్భుతమైన స్పందన పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్నదన్నారు. జినోం వ్యాలీ తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగ ప్రగతికి దోహదపడినట్లుగానే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఆటోమొబైల్ రంగంలో తెలంగాణ ప్రగతికి దోహదపడుతుందన్న నమ్మకం ఉన్నదన్నారు. ఐటీ రంగంలో 3.23 లక్షల మంది ఉద్యోగుల నుంచి ప్రస్తుతం 9.5లక్షలకు దాదాపు మూడు రెట్లు పెరిగాయన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరిగిన పారిశ్రామిక ప్రగతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, రియల్ ఎస్టేట్ వంటి ఇతర రంగాల బలోపేతానికి దోహదం చేసిందన్నారు. ప్రపంచానికి... దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్న ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేశ్వరం పట్ల గర్వంగా ఉందన్నారు.
దేశంలోని చిన్న రాష్ట్రమైన తెలంగాణ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించిందన్నారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు, పర్యావరణం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నదన్నారు. వివిధ అంశాల వారీగా అనేక జాతీయ అవార్డులు, ప్రపంచ ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు 2014లో ఉన్న పరిస్థితులను ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని బేరిజు వేసుకోవాలని, ఆ రోజుల్లో ఉన్న తాగు, సాగునీరు, విద్య, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. అనంతరం పారిశ్రామిక వేత్తలను, ఉత్తమ అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, వైస్ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి, అధికారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.