- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో పవర్ రాదని ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదు : మంత్రి హరీష్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: సొంత జాగల్లో ఇళ్లు కట్టుకోవడానికి త్వరలోనే స్కీం ప్రారంభిస్తామని, అందుకోసం బడ్జెట్ లో 12వేల కోట్ల రూపాయలు కేటాయించామని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా స్కీం వర్తింపజేస్తామన్నారు. యధావిధిగా డబుల్ బెడ్రూం పథకం కొనసాగుతుందని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలన్నీ ఓపికగా సావధానంగా విన్నానని, యాంత్రికమైన, నిస్సారమైన విమర్శలే తప్ప, నిర్మాణాత్మకమైన ధోరణి లేదన్నారు. బడ్జెట్ లో సింహభాగం నిధులు పేద ప్రజల సంక్షేమం కోసం బడుగు, బలహీనవర్గాల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనారిటీల కోసం, అగ్రవర్ణ పేదల కోసం కేటాయించిన సంక్షేమ ప్రధాన బడ్జెట్ ను విమర్శించడం అంటే, పేద ప్రజలకు ఏమీ చేయవద్దని చెప్పడమేనన్నారు.
ముసలవ్వలకు రక్షణ, పసిపిల్లలకు పోషణ, బడి పిల్లలకు శిక్షణ, ఉన్నత విద్యకు ఉపకారం, యువతకు ఉద్యోగ కల్పన ఉందన్నారు. తెలంగాణలో సమీకృత, సమ్మిళిత, సమగ్ర, సుస్థిర అభివృద్ధి ఉందన్నారు. నాడు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలే నాటి సమస్యలకు కారణమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దొందుదొందేనన్నారు. మనస్సు పెట్టి ఏనాడు ప్రజా సంక్షేమం పై దృష్టి పెట్టలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా అత్యంత ప్రాథమిక అవసరమైన తాగునీటి కోసం దేశంలో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారని, దేశ పాలకులకు ఇది అమృత్ కాల్.. దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు కూడా దొరకని ఆపద కాలం అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ తో ఒక మోడల్ ను దేశం ముందట పెట్టిందన్నారు. కేంద్రానికి ప్రజల పట్ల మమకారం లేకపోవడంతో తెలంగాణ తరహా అభివృద్ధి జరగడం లేదన్నారు. రాజకీయపార్టీలకు పాలిటిక్స్ గేమ్ అని, కేసీఆర్ కు మాత్రం టాస్క్ అన్నారు.
మిషన్ భగీరథ లో లక్షా 50 వేల కిలోమీటర్ల పైప్ లైన్, 37 వేల వాటర్ ట్యాంకులు, 13,901 రైల్వే, నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ కెనాల్స్ క్రాసింగ్స్, 1804 సర్వీస్ రిజర్వాయర్లు, 123 వాటర్ ట్రీట్మెంట్ ప్టాంట్లు, 77 ఇంటెక్ వెల్స్.. వీటన్నింటని మూడు నాలుగేళ్లలో పూర్తి చేయడం నిజంగా అది ఒక భగీరథ యత్నమేనని, అదొక టాస్క్ గా తీసుకున్నాం కాబట్టే సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన ఆరేండ్లలోనే అంటే 2020 వరకే మిషన్ భగీరథ ద్వారా వంద శాతం ఆవాసాలకు మేం నీళ్లిచ్చేశామన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కు రూ.44,933.66 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసిందన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి చేసిన వాస్తవ వ్యయం రూ.36,900 కోట్లు మాత్రమేనని, ఖచ్చితమైన ప్రణాళికతో, అత్యంత పారదర్శకంగా, ఆధునిక పద్ధతులు వినియోగించి నిర్ణీత సమయంలో పథకాన్ని పూర్తి చేయడం వల్ల రూ.8,033.66 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేయగలిగామన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామని, ఉమ్మడి పాలమూరు – రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా సస్యశ్యామల జిల్లాలుగా మారుస్తామన్నారు. ప్రాజెక్టును ఇప్పటికే 60 శాతం పూర్తి చేశామని, పర్యావరణ ట్రిబ్యునల్, కోర్టు కేసులతో అడ్డుకోవాలని చూస్తున్నారని అయినా పూర్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కృష్ణా జలాల్లో వాటా కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని, కేంద్రమే నాన్చుడు ధోరణి అవలంభిస్తుందన్నారు.
బీజేపీకి ఓట్లు, సీట్ల పైనే ప్రేమ అన్నారు. వాటా దక్కేవరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. గోదావరి నీళ్లను మంజీరకు వదిలాం, లక్షలాది ఎకరాలకు తాగునీరు ఇచ్చామన్నారు. పవర్ అడగకుండానే 24 గంటలు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో పవర్ కట్ ఉండేదని అందుకే వారికి పవర్ కట్ చేశారన్నారు. రాష్ట్రంలో ఇద్దరు బాధపడుతున్నారని ఇకరు మోటార్ వైండింగ్ చేసే వారు.. మరోకరు విపక్షాలు అన్నారు. ఆగకుండా పవరిస్తనే ఉంటం.
ప్రజలు కూడా మాకు పవర్ ఇస్తూనే ఉంటారు అని, పవర్ ఇక రాదని భయపడుతున్నారన్నారు. ప్రతిపక్షాలవారేమిచ్చిన్రు..? పవర్ హాలిడేలిచ్చిన్రు. కనుక ప్రజలు కూడా మీ పవర్ కు హాలిడే ఇచ్చిన్రు అని, అందుకే వారికి తింటే ఒంటబట్టడం లేదు.. పండితే నిద్రపట్టడం లేదన్నారు. తెలంగాణలో రైతు రాజ్యం ఉందన్నారు. బీజేపీ నేతలు ఆత్మనిర్బర్ భారత్ కాదు రైతులకు మేలు చేసే పని చేయాలని సూచించారు.
వ్యవసాయం కోసం, రైతు సంక్షేమం కోసం ఈ ఎనిమిదిన్నరేండ్లలో లక్షా 92 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలంలో రైతుల కోసం కేటాయించిన బడ్జెట్ కన్నా, మేం ఎనిమిదిన్నరేండ్లలో 20 రెట్లు ఎక్కువ ఖర్చుపెట్టినమన్నారు. రైతు అనే మాట కనిపిస్తే చాలు, నిధులలో కోత పెట్టారు. ఎరువుల సబ్సిడీ మీద కోత, ఫసల్ బీమా యోజనకు కోత ,పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి కోత రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన కి కోత, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇచ్చే నిధుల్లో కోత, ఫుడ్ సబ్సిడీకి కోత, మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ లో కోత అని మండిపడ్డారు.
ఎరువుల సబ్సిడీలో 50 వేల కోట్లు తగ్గించారని, పత్తి కొనుగోలుకు ఒకే ఒక్క లక్ష పెట్టారని. అంటే పత్తి కొనుగోలు నుంచి తప్పించుకొంటున్నారా అన్న అనుమానం కలుగుతున్నదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తమని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని మండిపడ్డారు. రైతులకు కోతలు.. కార్పొరేట్లకు మూటలని ఆరోపించారు. కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల్లో 19 లక్షల కోట్లు మాఫీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లను నమ్ముకుంటే వేస్ట్ అని, పంజాబ్ రైతులంతా ఆప్ కు ఓటేశారన్నారు. చేపలు ఆరబెట్టుకోవడానికి డ్రైయింగ్ ప్లాట్ ఫారంలు కడితే ఒప్పయిందట, మేం రైతులు వడ్లారబెట్టుకునేటందుకు కల్లాలు కడితేనేమో తప్పయిందట. 151 కోట్ల రూపాయల నిధులు వాపస్ ఇస్తున్నామన్నారు.
కేంద్రంలో కిరికిరి సర్కార్ పోవాలె – కిసాన్ సర్కార్ రావాలె అన్నారు. సుమారు 38 వేల కోట్ల రూపాయలు గ త బడ్జెట్ అంచనాలను అనుసరించి కేంద్రం నుంచి రావాల్సినవి రాలేదని, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రం ఎఫ్.ఆర్.బి.ఎం. సంస్కరణల నెపంతో 15,033 కోట్ల రూపాయల ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ను కుదించిందన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నందుకు 16,653 కోట్లు కోల్పోయామని, ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ అయిన 2021-2026 ఐదేండ్ల కాలంలో 30 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రాకుండా పోతాయన్నారు.
15వ ఫైనాన్స్ కమిషన్ తెలంగాణకు ఇవ్వమని చెప్పిన స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ 5,374 కోట్ల రూపాయలను బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఎగ్గొట్టిందన్నారు. ఫైనాన్స్ కమిషన్ 2022-23 బకాయిలు 2,016 కోట్లు, జీఎస్టీ పరిహారం కింద కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు 2,437 కోట్లు విడుదల చేయలేదన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల కోట్ల నిధులకు సైతం ఎగనామం పెట్టిందన్నారు. విద్యుత్ వినియోగంపై మూడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలని చెప్పిన కేంద్రం.. తెలంగాణకు ఏపీ నుంచి రావాల్సిన 17 వేల 800 కోట్లను ఇప్పించ లేదని,. ఏపీకి ఎఫ్ ఆర్ బీఎం లో ఆ 6 వేల కోట్లు ఇచ్చారు. ఏపీ మాదిరిగా మాకు కూడా ఇవ్వాల్సిన 17,800 కోట్లు ఇప్పించాలని కోరుతున్నామన్నారు.
ఏపీ విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు 1,350 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించలేదని, పొరపాటునో, ఉద్దేశపూర్వకంగానో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేసిన, తెలంగాణ సొమ్ము 495 కోట్లు ఇప్పించాలని, వినతులు సమర్పించినా, లేఖలెన్నో రాసినా, అన్నీ బుట్ట దాఖలే చేశారన్నారు. కేంద్రం ఎగనామం పెట్టిన నిధుల మొత్తం ఈ ఒక్క సంవత్సరంలో 37,809 కోట్ల రూపాయలన్నారు.
నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ భగీరథ నిధులు 19,205 కోట్లు, మిషన్ కాకతీయ 5 వేల కోట్లు, మొత్తంగా 24,205 కోట్లు కూడా తెలంగాణకు రావాల్సే ఉందన్నారు. న్యాయబద్ధంగా వచ్చే డబ్బులను ఒక్క పైసా వదిలి పెట్టామన్నారు. కచ్చితంగా పోరాడుతాం. తీసుకొని రావడానికి సర్వశక్తులు ఒడ్డుతాం. రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేస్తుంటే.. మేము అప్పులను క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కింద పెట్టాం. మా కాళేశ్వరం, మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ ఇవన్నీ భావి తరాలకు శాశ్వత ఆస్తులు అన్నారు.
ఫాం హౌస్ లో తాంత్రిక పూజలు కాదు అని, రండి చూపిస్తానని బీజేపీ నేతలకు సూచించారు. కపిల గోవుకు గోపూజ చేస్తున్నడన్నారు. తాత్కాలికంగా రెచ్చగొడతరేమో తప్ప తెలంగాణ ప్రజల మనసులను గెలవలేరని, అందరి దేవుళ్ళను గౌరవించారని,. అంతే తప్ప ఏ దేవున్నీ ద్వేషించలేదన్నారు. బీజేపీ పాలన తీరుగా యూనివర్సిటీలో "చేతబడిని" కోర్సుగా పెట్టలేదని, బనారస్ వర్సిటీలో చేతబడి కోర్సు పెట్టిన్రు. తంత్రాలైనా కుతంత్రాలైనా బీజేపీకే అలవాటు తప్ప, బీఆర్ఎస్ కుగాదన్నారు. ఆరోగ్యశ్రీని కూడా 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారని,ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం 10 లక్షలు చేశారు. ఆరోగ్యశ్రీ మీద ఈ ప్రభుత్వం 5 వేల కోట్లు ఖర్చు చేసింది. 21 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించామన్నారు.
మాతృ మరణాల రేటులో వెయ్యికి 43 శాతం తగ్గించగలిగామని, దేశంలో అతి తక్కువ మరణాల రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉందన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్ చిట్ట చివరి స్థానంలో ఉన్నదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 61 శాతానికి పెరిగాయన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులు అంతా కవులు అయిపోయిన్రు అన్నారు. కవులు అంటే కవిత్వం రాస్తున్రు అని కాదు. కంటే కనబడదు. వి అంటే వినబడదు. వీళ్లకు తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి కనబడదు, వినబడదు అన్నారు. విపక్ష సభ్యులు కంటి పరీక్షలు చేసుకోవాలని అప్పుడు అభివృద్ధిని చూడవచ్చని సూచించారు.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనా ప్రకారం పెద్ద నోట్ల రద్దు చేసిన మొదటి నెలలోనే చిన్న పరిశ్రమలు దాదాపు లక్షా 50 వేల కోట్ల నష్టాన్ని చవి చూశాయన్నారు. బీజేపీ అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి, అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నదన్నారు.చిట్టచివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే అంత్యోదయ సిద్ధాంతం. కానీ బీజేపీ వాళ్లకు పేద ప్రజల సంక్షేమం వద్దు, కార్పొరేట్లకు దోచిపెట్టుడే లక్ష్యమన్నారు.
కరోనా తర్వాత పారాసిటామల్ వాడుక ఎక్కువైంది. సందుల సందు అని పారాసిటామల్ ధరలు 10 శాతం కేంద్రం పెంచిందన్నారు. విద్య, వైద్యం, మున్సిపల్, పంచాయతీ, పరిశ్రమలు, ఐటీ... ఇలా ఏ రంగం చూసుకున్నా ప్రతి ఏటా అవార్డుల పంట అని ఇది అభివృద్దికి నిదర్శనమన్నారు. 2014 నుంచి 2022 వరకు లక్షా 41వేల 735 ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం 80 వేల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నదన్నారు.
జీడీపీని మంటగలపడంలో, ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో,160 లక్షల కోట్ల అప్పులు చేయడం లో, ఆకాశాన్ని తాకేట్టు సిలిండర్ ధర పెంచడంలో, పసి పిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించడంలో, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో, మత పిచ్చి మంటలు రేపడంలో డబుల్ సక్సెస్ అని మండిపడ్డారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, అర్హులైన వారందరికీ ఇండ్లు, రైతుల ఆదాయం రెట్టింపు , పటిష్టమైన లోక్ పాల్ బిల్లు, నదుల అనుసంధానం ధోఖా అని మండిపడ్డారు. దళిత బంధు అమలులో కొంత ఆలస్యం జరుగొచ్చు కానీ మాట ప్రకారం ఇస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్ పేదల బడ్జెట్, సంక్షేమ బడ్జెట్ అని స్పష్టం చేశారు.
- Tags
- harish rao