టీ- కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరం: మంత్రి హరీష్ రావు

by Satheesh |   ( Updated:2023-11-13 16:50:06.0  )
టీ- కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరం: మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌ని రాజకీయం కోసం నానా మాటలు తిట్టి.. ఈరోజు రాజకీయాల కోసం వైఎస్ఆర్టీపీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల అని మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షర్మిల మాటలు మాట్లాడిన మాటలు.. ఆమె వైఖరీ ఏమిటో బయటపడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వైఎస్ఆర్‌టీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరుకుంటున్నానన్నారు. వైఎస్ఆర్టీపీలో ఎదుర్కొన్న సూటిపోటి మాటలు అవహేళనలు బీఆర్ఎస్ పార్టీలో ఉండవని పేర్కొన్నారు. వైఎస్ఆర్టీపీ సీనియర్ నాయకుడు గట్టు రామచందర్ రావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కర్నాటక మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామని చెప్తున్న కర్ణాటక మోడల్ ప్రజలకు అర్థమైందన్నారు. కర్ణాటకలో రైతులు రోడ్డు మీదకు వస్తున్నారని, మూడు గంటల కరెంటు ఇచ్చి రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ మోడల్ తెలంగాణలో పనికిరాదని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తోక ముడ్చుకుందన్నారు. రైతులకు ఇస్తున్న రైతుబంధు దండగ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు మార్పురావాలని అంటున్నారని, ఆ మార్పు పదవుల్లో కాదు.. ప్రజల జీవితాల్లో రావాలి అని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవహేళన చేసేలా కాంగ్రెస్ మాట్లాడుతున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కూడా అవహేళన చేసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నడని, తెలంగాణ అమరవీరులను అవహేళన చేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కించపరచేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. సీమాంధ్ర నాయకుల సూట్ కేసులు మోయడానికి అలవాటు పడ్డ వెన్నెముక లేని నాయకులు తెలంగాణని సమైక్య పాలకుల పాదాల దగ్గర పెట్టుతారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి 35, 40స్థానాల్లో అభ్యర్థులు లేని పరిస్థితి అని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని.. హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం గురించి తెలవని రేవంత్ రెడ్డికి రైతులు ఎన్ని గంటలు పవర్ మోటర్ ఉపయోగిస్తారో కూడా తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరమని, ఆయనతోనే ఆపార్టీ అబాసు పాలవుతున్నారు. వైఎస్ఆర్ టీపీలో ఎదుర్కొన్న సూటిపోటి మాటలు అవహేళనలు బీఆర్ఎస్ పార్టీలో ఉండవు అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా పార్టీ నడపగలుగుతారా తెలంగాణ వాళ్లకు అంత సీను ఉందా అనే అవహేళన మాటలు ఎన్నో విన్నామన్నారు. ఇలాంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ అన్నారు. సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టడం కాదని అవహేళన చేశారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చీకటి మయమైతుందని చెప్పారని, ఆయనలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే లాగా ఈరోజు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుని అమలు చేసేలా చేశారన్నారు.

Advertisement

Next Story