అంపశయ్యపై ప్రభుత్వ విద్యారంగం.. ప్రైవేటు వర్సిటీలకు తివాచీ పరిచారు: ప్రొఫెసర్ కోదండరాం

by Mahesh |
అంపశయ్యపై ప్రభుత్వ విద్యారంగం.. ప్రైవేటు వర్సిటీలకు తివాచీ పరిచారు: ప్రొఫెసర్ కోదండరాం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ హయాంలో ఉన్నత విద్యను పూర్తిగా అశ్రద్ధ చేశారని, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఎర్ర తివాచీ పరిచి.. ప్రభుత్వ ఉన్నత విద్యారంగానికి అంపశయ్య మీదికి పంపారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు చేశారు. హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ‘తెలంగాణా ఉన్నత విద్యారంగాన్ని పునర్నిర్వచించడం’ అనే అంశంపై నిర్వహించిన చర్చా వేదికను కోదండరాం ప్రారంభించారు. రాష్ట్ర ఉన్నత విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్న పలు అంశాలను వారు నిశితంగా చర్చించారు. రాష్ట్ర ఉన్నత విద్యారంగ బాధ్యులు, ఆచార్యులు, ఎన్‌జీవోల ప్రతినిధులు తమ తమ అభిప్రాయాలను, పలు సూచనలను అందించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

అలాగే తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ప్రయత్నాలను అభినందించారు. విద్యా, వైద్య, నీటిపారుదల రంగాల మెరుగుదలకు ఫోరం చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనంతరం తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం భారత్ చైర్మన్ ఎంవీ గోనారెడ్డి, అధ్యక్షుడు రాజేశ్వర్ ప్రభుత్వ పాఠశాల కోసం ‘సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్’ అనే కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, విద్యారంగ నిపుణులు వెంకట రెడ్డి, డాక్టర్ పిచ్చయ్య, కత్తి వెంకటస్వామి, శ్రీనివాస చారి, మెరుగు భాస్కర్ రెడ్డి, ఆచార్య లక్ష్మణ్ రావు, డాక్టర్ నర్సింగ్, డాక్టర్ నర్సింహా, డీపీ రెడ్డి, రణధీర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story