మేడిగడ్డ డ్యామేజ్‌ ఎఫెక్ట్.. 6 రోజుల్లో 73 టీఎంసీలు వృథా

by Rajesh |
మేడిగడ్డ డ్యామేజ్‌ ఎఫెక్ట్.. 6 రోజుల్లో 73 టీఎంసీలు వృథా
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు కల్పతరువు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నా కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ దగ్గర చుక్క నీటిని కూడా నిల్వచేసుకోలేని నిస్సహాయ పరిస్థితి నెలకొన్నది. ఆ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగిపోవడం, ఒక పిల్లర్‌కు పగుళ్లు రావడంతో ప్రమాదాన్ని నివారించడానికి మొత్తం గేట్లను పూర్తిస్థాయిలో పైకి లేపాల్సి వచ్చింది. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లే సముద్రంలోకి వెళ్లిపోతున్నది. ఇక్కడ చేరుకున్న నీటిని పంపింగ్ ద్వారా ఎగువకు తరలించి రిజర్వాయర్లలో నిల్వ చేసే ఉద్దేశంతో బ్యారేజీని నిర్మించినా ప్రయోజనం లేకుండాపోయింది. గత వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా మేడిగడ్డకు చేరుకున్న నీటిని ఒడిసిపట్టుకోలేకపోవడంతో ఆరురోజుల్లోనే సుమారు 73 టీఎంసీల నీరు దిగువకు వెళ్లిపోయినట్టు ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు.

వృథాగా సముద్రంలోకి..

ఈ నీటిని వదిలేయడం తప్పా స్టోర్ చేసుకునే అవకాశం లేకుండాపోయింది. మేడిగడ్డ కుంగిన పాపమే ఇప్పుడు మన రైతులకు శాపంగా మారిందని, రానున్న సీజన్‌కు నీటిన అందించలేకపోయే పరిస్థితికి దారితీసిందన్నది వారి వాదన. వారం క్రితం స్వల్ప స్థాయిలో మొదలైన గోదావరి వరద ఉధృతి శనివారం సాయంత్రం నాటికి 3.75 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నది. దీనికి ముందు రోజు మేడిగడ్డ దగ్గర ప్రవాహ తీవ్రత 3.41 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఆరు రోజుల్లో వరద ఉధృతిని లెక్కించిన అధికారులు మొత్తంగా 73 టీఎంసీల మేర వృథాగా సముద్రంలోకి వెళ్లిపోయినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రానున్న రోజుల్లో సైతం వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేయడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. నీటిని నిలిపితే బ్యారేజీకి ప్రమాదం..వదిలితే బ్యారేజీ కట్టినదానికి ఫలితం లేదు..అనే చర్చలు మొదలయ్యాయి.

ప్రాజెక్టుల తాజా పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ ఆరా

రాష్ట్రంలో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు తదితర జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడంతో నాలుగైదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసి వరద తీవ్రత మరింత పెరగనున్నది. దీనికి తోడు ఎగువన మహారాష్ట్రలో సైతం భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో గోదావరితో పాటు ఉప నదుల్లోనూ వరద ఉధృతి పెరిగింది. పొరుగు రాష్ట్రాల్లోని ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరుగుతున్న రాష్ట్ర సాగునీటిపారుదల ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్థానిక అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సైతం గోదావరి పరివాహక ప్రాంతాల్లోని మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల తాజా పరిస్థితిని తెలుసుకుంటూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. చెరువులకు గండ్లు పడే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని సమాయత్తం కావాలని సూచించారు.

మేడిగడ్డకు పొంచిన ముప్పుపై ఎన్డీఎస్ఏ సూచనలు

మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లోని పిల్లర్లు గతేడాది అక్టోబరులో కుంగిపోవడంతో ముప్పు ఉందని గ్రహించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర నీటిని కనీస స్థాయిలో కూడా నిల్వ చేయవద్దంటూ మధ్యంతర నివేదికలో స్పష్టం చేసింది. బ్యారేజీలో నీటి నిల్వ చేస్తే ఏడో బ్లాక్‌లో బయటపడ్డ డ్యామేజీ పక్కన బ్లాకులు, పిల్లర్లపైనా ప్రభావం చూపిస్తుందని, ఊహించనంత ప్రమాదం తలెత్తుతుందని హెచ్చరించింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలేసేలా మొత్తం 85 గేట్లనూ పూర్తిస్థాయిలో పైకి లేపి ఉంచాలని నొక్కిచెప్పింది. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే ఈ పనులు చేయాలని సూచించింది. మరోవైపు తక్షణం చేయాల్సిన రిపేర్ పనులపైనా అధికారులకు నిర్దిష్టమైన ప్లానింగ్ ఇచ్చింది. ఆ పనులన్నీ పూర్తిస్థాయిలో కంప్లీట్ కావడానికి ముందే వరద వచ్చేసింది.

మేడిగడ్డ బ్యారేజీ గతేడాది అక్టోబరులోనే డ్యామేజ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో పడిపోయిన బీఆర్ఎస్ (అప్పటి అధికార పార్టీ) దిద్దుబాటు చర్యల దిశగా ఆలోచన చేయలేదు. రెండున్నర నెలల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో వెంటనే చేపట్టాల్సిన రిపేర్ పనులపై ఎన్డీఎస్ఏ నుంచి గైడెన్సు తీసుకున్నది. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతనే బ్యారేజీలను భవిష్యత్తులో ఎలా నిర్వహించాలనే అంశంపై స్పష్టత రానున్నది. అప్పటివరకూ మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసులను అమలు చేయడంపైనే రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. మేడిగడ్డకు ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీలో సైతం నీటి బుంగల (వాటర్ బాయిలింగ్) సమస్య తలెత్తడంతో అక్కడ కూడా అన్ని గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి ఉంచాల్సిందిగా ఎన్డీఎస్ఏ సిఫారసు చేసింది. ఆ బ్యారేజీ దగ్గర శనివారం మధ్యాహ్నం సమయానికి సుమారు 13 వేల క్యూసెక్కుల వరద ఉన్నది. ఈ నీటిని కూడా దిగువకు వదిలేయాల్సి వచ్చింది.

గోదావరి ప్రాజెక్టుల వద్ద తీవ్ర వరద ఉధృతి

మేడిగడ్డ దగ్గర మాత్రమే కాకుండా గోదావరి నదిపై కట్టిన పలు ప్రాజెక్టుల దగ్గరా వరద ఉధృతి తీవ్రంగానే ఉన్నది. ఇరిగేషన్ అధికారులు అందించిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రానికి తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) దగ్గర 4,82,800 క్యూసెక్కులు, దుమ్మగూడెం (సీతమ్మ సాగర్) దగ్గర 5,93,167 క్యూసెక్కులు, భద్రాచలం దగ్గర 4,08,045 క్యూసెక్కుల వంతున ప్రవాహం నమోదైంది. కండ్ల ముందే భారీ స్థాయిలో వరద నీటిని సముద్రంలోకి వృథాగా వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఇంజినీర్లలో ఆవేదన వ్యక్తమవుతున్నది. వేల కోట్ల రూపాయలతో 3 బ్యారేజీలను కట్టుకున్నా ఒక్క చుక్కను కూడా నిలుపుకోలేకపోతున్నామని, నిర్మాణం లోపాల్లేకుండా పటిష్టంగా ఉన్నట్లయితే వచ్చే సీజన్‌కు సరిపోయేంత నీటిని లిఫ్టు చేసుకుని వేర్వేరు రిజర్వాయర్ల దగ్గర నిల్వ చేసుకునేవారమన్న అభిప్రాయాన్ని పలువురు ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేశారు.

మేడిగడ్డ దగ్గర వరద ఉధృతి : (క్యూసెక్కులలో)

జూలై 15 : 41,200

జూలై 16 : 41,200

జూలై 17 : 49,500

జూలై 18 : 53,400

జూలై 19 : 3,41,350

జూలై 20 : 3,73,500

Advertisement

Next Story

Most Viewed