- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘దిశ’ చూస్తే యంగ్ ఇండియా గుర్తొస్తోంది: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవలి మీడియాలో ‘దిశ’కు ప్రత్యేక స్థానమున్నదని, పట్టణ గ్రామీణ తేడా లేకుండా అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లలో, సోషల్ మీడియాలో, అందరి నోళ్లలో ‘దిశ’ పేరు మార్మోగుతున్నదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘దిశ’ నాల్గవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్ళ కాలంలోనే తెలుగు పాఠకుల మనన్నలను చూరగొన్న ‘దిశ’ తన ప్రయాణంలో సక్సెస్ అయిందన్నారు. ఈ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎక్కువగా 35 ఏండ్ల వయసులోపు యూత్ ఉన్నారని, వీరిని చూస్తూ ఉంటే ‘యంగ్ ఇండియా’ గుర్తుకొస్తున్నదన్నారు. రేపటి జర్నలిజాన్ని నడిపించేది ఇలాంటి యువతరమేనని నొక్కిచెప్పారు.
పాత్రికేయ వృత్తిలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చి అక్రెడిటేషన్ ఒక సంక్లిష్ట సమస్యగా మారిందని, నిర్దిష్టమైన ప్రామాణికాలు ఉన్నప్పటికీ అర్హులైన చాలా మందికి అందడంలేదనే అసంతృప్తి బలంగా ఉన్నదన్నారు. రిపోర్టింగ్ విధుల్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు తప్పనిసరి అవసరమన్నారు. ఇవి వారి వృత్తికి ఇచ్చే గుర్తింపు అని నొక్కిచెప్పారు. సమాచార సేకరణలో అక్రెడిటేషన్లు తప్పనిసరి అవసరంగా మారాయని, ఇవి లేకపోవడం వలన వార్తా సేకరణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఆంక్షల పేరుతో ప్రభుత్వం కోత పెట్టడం ద్వారా ప్రభుత్వ సమాచారం ప్రజలకు చేరవేయడంలో గ్యాప్ ఏర్పడుతుందన్నారు. ఫలితంగా అది ప్రభుత్వానికి, సమాజానికి కూడా చేటు చేస్తున్నదని వివరించారు.
అక్రెడిటేషన్లను సంపాదించుకోడానికి జర్నలిస్టులు తొలినాళ్ళలో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న హక్కుగా దీన్ని భావించామని, అయితే ఇటీవలి ప్రభుత్వాలు సంఖ్యను చూసి బెంబేలెత్తిపోయి అక్రెడిటేషన్లు కుదించడంపై ఫోకస్ పెట్టాయని పేర్కొన్నారు. ఇది అనారోగ్యకరమైన పరిణామం అని వ్యాఖ్యానించారు. మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా మీడియా సంస్థలూ పెరిగిపోతున్నాయని, ఫలితంగా అందులో పనిచేసే పాత్రికేయుల సంఖ్య కూడా పెరుగుతోందని వివరించారు. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వారికి అక్రెడిటేషన్లు ఇవ్వడం ఒక బాధ్యతగా ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ఉద్యమం సమయంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కేసీఆర్ ఒక సమావేశం పెట్టిన సందర్భంలో అందరికీ అక్రిడిటేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు.
జర్నలిస్టు సంఘం నాయకుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వంతో అనేకమార్లు సంప్రదింపులు జరిపి అక్రెడిటేషన్లపై నిర్దిష్టమైన సూచనలే చేశాన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్‌గా ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య వారధిగా ఈ హక్కు సాధనలో తన వంతు కృషిచేస్తానని తెలిపారు. సంఖ్యను చూసి కాకుండా వృత్తిపరమైన జర్నలిస్టులకు హక్కు కోల్పోరాదన్నది ప్రామాణికం కావాలన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సమస్య కూడా తీవ్రంగానే ఉన్నదని, దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. జర్నలిస్టులు కూడా ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరడంలేదని, ప్రభుత్వ రేటు ప్రకారమే వారికి అందజేయాలని కోరుతున్నారని ఆయన వివరించారు. జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ఇండ్ల స్థలాలను పరిష్కరించిన తర్వాత మిగిలిన జర్నలిస్టుల విషయంలోనూ దానిని సాకారం చేసేందుకు దృష్టి పెడతానని హామీ ఇచ్చారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల దైనందిన అవసరాల్లో భాగంగా మారిన సోషల్ మీడియా విస్తృతమైందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలూ దీన్ని వాడుతున్నాయని, గుర్తిస్తున్నాయన్నారు. కానీ ఈ రంగంలో పనిచేసే జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులకు నోచుకోలేకపోతున్నారన ఆవేదన వారిలో వ్యక్తమవుతున్నదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో, కొన్ని రాష్ట్రాల్లో నిర్దిష్టమైన డిజిటల్ మీడియా పాలసీలు ఉన్నాయని, తెలంగాణలో సైతం దాని అవసరాన్ని ప్రభుత్వానికి వివరించి ఆ దిశగా ఒక పాలసీ రూపకల్పన విషయంలో చొరవ తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేగం, ప్రింట్ మీడియా విశ్వసనీయత ‘దిశ’ సొంతం : మార్కండేయ, ఎడిటర్
సోషల్ మీడియా వేగం, ప్రింట్ మీడియా విశ్వసనీయత ‘దిశ’ సొంతమని ఎడిటర్ మార్కండేయ అన్నారు. ట్రెడిషనల్ మీడియాకు భిన్నంగా ‘దిశ’ ప్రత్యేక మార్క్ అందుకుందన్నారు. సాధారణంగా ఒక పత్రిక నడవాలంటే ప్రింట్, ఇతర ఖర్చులు చాలా అవుతాయని, కానీ తక్కువ బడ్జెట్‌తో తాము మొదలై ఒక బ్రాండ్‌గా, ట్రెండ్ సెట్టర్‌గా అవతరించామని వ్యాఖ్యానించారు. ఎన్నో సవాళ్లను అధిగమించామని, యంగ్ జర్నలిస్టులకు నిలయంగా మారిందన్నారు. తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ ఇన్ పుట్స్ అందిస్తున్న సంస్థగా పేర్కొన్నారు. కరోనా సమయంలోనే ‘దిశ’కు పేరొచ్చిందని, ఒక అడ్వాంటేజీగా మారిందన్నారు. పేపర్ అంటే ప్రజల్లో విశ్వసనీయత ఉందని, టీవీలలో, వెబ్‌సైట్‌లో మాత్రం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందుతూ ఉంటాయన్నారు. అదే తరహాలో ‘దిశ’ కూడా ఎప్పటి వార్తలను అప్పుడే అందించే కొత్త ఒరవడికి ‘డైనమిక్ ఎడిషన్ల’ పేరుతో శ్రీకారం చుట్టిందన్నారు.
ఎప్పటి వార్తలు అప్పుడే పేపర్ రూపంలో అందించేందుకు తీసుకొచ్చిన డైనమిక్ ఎడిషన్ సక్సెస్ అయిందన్నారు. తక్కువ సమయంలోనే ప్రధాన పత్రికల ర్యాంకింగ్‌ను దాటామని వివరించారు. ‘దిశ’కు వస్తున్న పేరు ప్రఖ్యాతిని చూసి ఎంతోమంది, ఎన్నో రకాలుగా ట్రోల్స్ చేశారని, కొన్నిసార్లు బండి సంజయ్ పత్రిక అని, మరికొన్నిసార్లు రేవంత్ రెడ్డి పత్రిక అంటూ రకరకాలుగా దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. కానీ ‘దిశ’ ఎన్నడూ ఏ పార్టీకీ కొమ్ముకాయలేదని, ప్రజలపక్షం వహిస్తూ ప్రభుత్వంలోని లోపాలను, తప్పులను ప్రజలకు విడమరిచి చెప్పిందన్నారు. అదే సమయంలో విపక్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌పై కూడా ఎన్నో విమర్శనాత్మక కథనాలను ప్రచురించిందని వివరించారు. అందుకే ప్రజలు విశ్వాసంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
జనం మెచ్చిన మీడియాగా మార్కెట్‌లో ఉన్నామన్నారు. ‘దిశ’ సక్సెస్‌ను చూసి చాలామంది ఇలాంటి సంస్థలను పెట్టాలనుకుంటున్నారని, అలాంటి వారికి అవకాశం కల్పించేలా, ప్రోత్సహించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలన్నారు. పత్రికలకు మాత్రమే కాకుండా.. వెబ్ బేస్డ్ గా వస్తున్న వాటికీ తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. వెబ్ ర్యాంకింగ్, గూగుల్ ఎనలిటిక్స్ లాంటి ప్రామాణికాలను చూసి వాటి ఆధారంగా అక్రెడిటేషన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఎంతోమంది పాత్రికేయులకు, ఔత్సాహికులకు, ఈ రంగంలోకి రావాలనుకునే యూత్‌కు ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుందన్నారు. ‘దిశ’కు 9 కోట్ల యూనిక్ యూజర్లు ఉన్నారని, నిత్యం సగటున 40 లక్షల మంది విజిటర్స్ వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని, తెలంగాణలోనూ ఇలాంటి వ్యవస్థ ఉనికిలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
సమిష్టి కృషితో సక్సెస్ సాధ్యమైంది : మోహన్‌రావు, ఎండీ
‘దిశ’ ఇప్పుడు పూర్తి చేసుకున్న నాలుగేండ్లు మాత్రమే కాక మరో 40 ఏండ్లకుపైగా విజయపథంలో సాగాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రావు ఆకాంక్షించారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, తాను మీడియాలో రావడానికి స్ఫూర్తి కూడా ఆయనేనని చెప్పారు. ‘దిశ’ ఈస్థాయికి రావడంలో సంస్థలోని ప్రతి ఒక్కరి కృషి, పట్టుదల, అంకితభావం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మోహన్ రావు కోరారు.
డిజిటల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత గత ప్రభుత్వానికి తెలుసని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కేటీఆర్ ‘32 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెడితే బాగుండేది’ అని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తించని ప్రాధాన్యతను పవర్ జారిపోయిన తర్వాత ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఇప్పటి ప్రభుత్వం అయినా వాటికోసం ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందన్నారు.