రాష్ట్రపతి నిలయంలో ‘‘ఉద్యాన్ ఉత్సవ్’’..

by Aamani |
రాష్ట్రపతి నిలయంలో ‘‘ఉద్యాన్  ఉత్సవ్’’..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : సువిశాల స్థలం.. ఆహ్లదకరమైన వాతావరణం.. పచ్చిక బయళ్లు.. అందమైన గోపురాలు.. ఔషధ మొక్కలతో కొలువుదీరిన రాష్ట్రపతి భవన్ సందర్శకులకు ఈసారి ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది.శీతకాల విడిది లో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీ వరకు బస చేయనున్నారు. అనంతరం సందర్శకులకు ‘ఉద్వాన్ ఉత్సవ్’ తో కనువిందు చేయనున్నారు.

పిక్నిక్ స్పాట్ లా..

అగ్రికల్చర్ అథారిటీ ఇనిస్టిట్యూట్ , సాంస్కృతిక, టూరిజం శాఖల సమన్వయంతో ‘ఉద్యాన ఉత్సవ్’ అనే పేరుతో రాష్ట్రపతి నిలయాన్ని ఒక పిక్నిక్ స్పాట్ గా తయారు చేయబోతున్నారు.సువిశాలమైన భవనంలో ఆహ్లాదకర వాతావరణంలో పచ్చిక బయళ్ల మధ్యను స్టాల్స్, చిన్న చిన్న కుటీరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక భౌగోళిక వ్యవసాయం, సమీకరణ వ్యవసాయం పై అవగాహన కల్పించేలా కుటీరాలను, స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్దేశిత ప్రాంతాలలో నిర్దేశిత పంటలు, వ్యర్థాలతో ఉపయోగాల తయారీ గురించి ప్రజలకు, విద్యార్థులకు తెలిసేలా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. తమ తమ ఇళ్లలో నర్సరీ, గార్డనింగ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలిపేలా చిన్న చిన్న మెళకువలతో స్టాల్స్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పిక్నిక్ స్పాట్ లా ఉండేలా పిల్లలకు ప్లే ఏరియా రెడీ చేస్తున్నారు.ఇంతే కాకుండా చిరుతిండ్లు స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.

తీపి గుర్తులా మిగిలేలా..

ఉద్యాన ఉత్సవ్ ను తిలకించేందుకు వసతి గృహాల విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకువచ్చి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించి, ఒక తీపి గుర్తుగా ఉండిపోయేలా వారి జ్ఞాపకాలలో నిలపాలని అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరు మంచి అనుభూతితో తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఉద్వాన్ ఉత్సవ్ ను సక్సెస్ చేసేందుకు, సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని యోచిస్తున్నారు.ఎంత మంది సందర్శకులు వచ్చిన వారికి ఎలాంటి లోటు రాకుండా త్రాగునీరు, అంబులెన్స్, మొబైల్ టాయిలెట్లు, రవాణా , లైటింగ్ వంటి మౌలిక వసతులను సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

భవనానికి ప్రత్యేకత..

రాష్ట్రపతి నిలయాన్ని 76 ఎకరాల విస్తీర్ణంలో 16 గదులతో నిర్మించారు. దర్బార్ హాల్, డైనింగ్ హాల్, సినిమా హాల్,మార్పింగ్ రూమ్ ఇలా విశాలమైన గదులు ఉన్నాయి. ప్రధాన భవంతికి కొంత దూరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంట గది నుంచి భవనంలోకి వెళ్లేందుకు సొరంగ మార్గం ఉంది. ఇదే ప్రాంగణంలో సుమారు 150 మంది సిబ్బంది నివాసానికి అనువైన క్వార్టర్స్ అందుబాటులో ఉన్నాయి.

ఔషధ వనం..

రాష్ట్రపతి భవన్ లో 2010లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఔషధ వనం ఏర్పాటు చేశారు.ఔషధ వనంలో ఏర్పాటు చేసిన 116 మొక్కలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ఐదెకరాల విస్తీర్ణంలో ఔషధ గుణాలు ఉన్న 116 రకాల మొక్కలతో ప్రత్యేక హెర్బల్ గార్డెన్ ను అందంగా తీర్చిదిద్దారు. ఆయుర్వేదం, యునానితో పాటు ఇతర ఔషదాలకు వినియోగించే మొక్కలను పార్క్ లో ఏర్పాటు చేశారు. ఇక్కడ నాటిన ప్రతి ఔషధ మొక్కలో ఒక్కొ గుణం దాడి ఉంది. శరీర రుగ్మతలను తొలగించేందుకు ఈ మొక్కలు దోహదపడతాయని పలువురు సందర్శకులు తెలియజేశారు.

నక్షత్ర వాటిక..

రాష్ట్రపతి నిలయంలో నక్షత్ర వాటిక ప్రత్యేక ఆకర్షణగా సందర్శకులను కనువిందు చేయనుంది. 2013 డిసెంబర్ లో ఈ వాటిక ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ వాటికను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఎకన్నర స్థలంలో వలయాకారంలో చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు. 27 రకాల నక్షత్రాలు, 9 గ్రహాల పేరుతో ఈ మొక్కలను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో 76 ఎకరాల స్థలంలో పార్క్ విస్తరించి ఉంది. సొరంగ మార్గంలో ఏర్పాటు చేసిన వంటశాల, ఉద్యాన వనాలు, పండ్ల తోటలు, పురాతన దేవాలయం, తాజాగా ఏర్పాటు చేయబోయే ఉద్వాన ఉత్సవ్ చూడ ముచ్చటగా ఉండనున్నాయి.


సొరంగ మార్గం..

రాష్ట్రపతి డైనింగ్ రూమ్ కి భోజనాన్ని తీసుకువెళ్లేందుకు ఉపయోగించే సొరంగ మార్గం మరో ప్రత్యేక ఆకర్షణ. దీని పొడవు 50 మీటర్లు, ఇప్పటికీ ఈ మార్గంలోనే వంటశాల నుంచి రాష్ట్రపతికి భోజనం తీసుకువెళ్లుతుంటారు. ఈ సొరంగ మార్గం ప్రత్యేక ఆకర్షణకు నిలుస్తోంది.


పూలతోటలు..

రాష్ట్రపతి నిలయంలో పూల తోటలకు ప్రత్యేక స్థానం ఉంది. మొత్తం 17 ఎకరాల్లో 35 రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. వీటిలో ఆరుదైన పూల మొక్కల అందాలు సందర్శకులను అలరిస్తాయి. ఫౌంటెయిన్లతో నిండిన గార్డెన్ లు ఆహ్లాద నిస్తాయి. అదేవిధంగా ఊడల ఊయల రాష్ట్రపతి భవనం వెనకాల కుడివైపున ఉంటుంది. చెట్లకు వేలాడే ఊడలు పిల్లలకు ఉయ్యాలలూగేందుకు అనువుగా ఉంటాయి.







Advertisement

Next Story