రేవంత్ సర్కార్ ఆగడాలను అడ్డుకుంటాం

by Naveena |
రేవంత్ సర్కార్ ఆగడాలను అడ్డుకుంటాం
X

దిశ, ఆర్మూర్ : ఫార్ములా ఈ కార్ రేసింగ్‌ లో అవకతవకలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేటీఆర్ పై నమోదు చేసిన కేసు రాజకీయ కక్ష లో భాగమేనని ఆయన విమర్శించారు. ఈ రకమైన కాంగ్రెస్ దుశ్చర్యలు బీఆర్ఎస్ నేతల నైతిక స్తయిర్యాన్ని దెబ్బతీయలేవని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, ప్రజాసమస్యలపై ఆయన సాగిస్తున్న పోరాటాలకు భయపడి కేసులతో వేధిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కేటీఆర్ పై తప్పుడు కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేతలు ఏదైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దబాయింపు ధోరణితో విచారణల పేరిట అక్రమ కేసులు పెడుతుంద‌ని ఆయన ఆరోపించారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర‌ ఇమేజ్ పెంచడం కోసం కేటీఆర్ పని చేస్తే..ఇవాళ కేటీఆర్ మీద అన్యాయంగా కేసు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చ‌ర్చ‌కు పెడితే స‌మాధానం చెప్పేందుకు రెడీగా ఉన్న‌ట్లు కేటీఆర్ స్ప‌ష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సీఎం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ ను దెబ్బతీయలేరని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు, ఆగడాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పోరాడుతాయని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యవాదులంతా కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story