సదాబహార్ సినిమా... అద్భుతం, పరమాద్భుతం

by srinivas |   ( Updated:2024-12-19 15:29:31.0  )
సదాబహార్ సినిమా... అద్భుతం, పరమాద్భుతం
X

ఒక్కోసారి, సమకాలీన సినిమాలల్లో మనకు నచ్చినవి దొరక్క ఏదో వినోదానికి ముందుకు తోసేస్తూ కొన్నికొన్ని సినిమాలు చూసేస్తూ ఉంటాము, కాలక్షేపానికి కూడా కాదు, కేవలం కాలాన్ని గడపటం కోసం. ముఖ్యంగా పదవీ విరమణ చేసి 60లు దాటిన వారికి ఇది అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మంచి సినిమా కోసం అంగలారుస్తూ, చకోర పక్షుల్లా కాపు కాస్తూ ఉంటాము. కాస్తో కూస్తో మంచి సినిమాలు చూడటం, మంచి పుస్తకాలు చదవటం, మంచి సంగీతం వినాలనుకున్న సీనియర్ సిటిజన్ల గురించి పై మాట. అఫ్ కోర్స్, గోడ మీద బల్లిలా బతికే వాళ్ళకు ఈ మాట వర్తించదు. వాళ్ళు భూమ్మీదే మోక్షం సంపాయించిన చిద్విలాసులు.

నిన్న, అనుకోకుండా ప్రసార భారతి వారి "Waves" OTTమొదలు పెట్టిన తరువాత సరిగ్గా చూడనే లేదూ, అందులో కంటెంట్ ఏమున్నది అని "అన్వేషిస్తుంటే" , మొదట్లోనే "సదాబహార్" అనే సినిమా, 2024లో తీసినదే సరికొత్త సినిమా కనపడింది. నిజం చెప్పొద్దూ, జయ బాధురి సినిమాలు ఎప్పుడో చూసిన, "గుడ్డి", "మిలి", "బావర్చి", "అభిమాన్", "షోలే"(దాదాపుగా గెష్ట్ పాత్ర) తరువాత, జయ బాధురి సినిమా నేను చూసినది లేదు. ఇన్నాళ్టికి, Waves OTTలో ఈ సినిమా పోష్టర్ చూసేప్పటికి ఆవిడ సినిమా మళ్ళీ చూడాలనిపించి క్లిక్ చేసిన మాట వాస్తవం. Thank you Prasara Bharati "Waves" OTT!


విషయంలోకి వస్తే, "సదాబహార్" గంటా ముప్పై రెండు నిమిషాల సినిమా. కథ, అంతకంటే చూపించిన విధానంలో ఉన్న Depth వల్ల కాబోలు, ఎంతోసేపు చూసినట్టు అనిపిస్తుంది. సినిమాలో కథ చాలా చిన్నది, Pure Nostalgia Movie, పెద్ద వయస్సులోకి వచ్చిన అందరికీ అనుభవంలోకి వచ్చినది, వచ్చే అవకాశం ఉన్నదీనూ. చివరికి ముగింపు మాత్రం అనూహ్యం. అలా అవుతుందని మనం అనుకోను కూడా అనుకోలేము.

ముంబాయిలో, ఒక చక్కటి ఇంట్లో 60-70 ఏళ్ళావిడ ఉండటం చూపిస్తారు. చాలా Subtleగా ఆవిడ భర్త కొంతకాలం క్రితం మరణించారని మనకు తెలిసేట్టు చేస్తారు దర్శకుడు గజేంద్ర విఠల్ అహిరే.

జష్ట్ ముగ్గురంటే ముగ్గురు నటులతో, తనకు మాత్రమే సొంతమైన చక్కటి Ambience తో ఒక అద్భుతాన్ని సృష్టించాడు ఈ 55 ఏళ్ళ దర్శకుడు. ఎవరా ముగ్గురు? మొదట చెప్పిన జయ బాధురి ముఖ్య పాత్రలో, రేడియో మెకానిక్‌గా రాజేంద్ర గుప్తా, ఆపైన ఆ మెకానిక్ కొడుకుగా రజత్ కపూర్. కింద చివర్లో ఇచ్చిన ఇమేజిలో వారు ముగ్గురూ కనిపిస్తారు, నాలుగో ఆయన దర్శకుడు. ఈ ముగ్గురితో పాటు, ఇంకా ఎక్కువగా కనిపించే ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర, జయబాధురికి పొద్దున, సాయంత్రం వచ్చి వంట చేసిపెట్టి, ఇంట్లో పనులన్నీ చక్కదిద్ది వెడుతూ ఉండే అమ్మాయి. ఇంకా, రేడియో మెకానిక్ దగ్గరకు వెళ్ళటానికి దారి చూపించే కుర్రాడితో సహా, మరి రెండు-మూడు సత్తరకాయ పాత్రలు.

సరే మళ్ళీ కథలోకి వస్తే, ఒంటరి జీవితం గడుపుతున్నావిడకు తోడు ఒక రేడియో. అది కూడా ఎప్పటిదో 1970 మోడల్ పాత వాల్వ్ రేడియో. పొద్దున కార్యక్రమాలు మొదలు పెట్టిన దగ్గర నుంచి వింటూ, తన అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది ఆవిడ. దర్శకుడి గొప్పతనం ఏమంటే, అనవసరంగా గుండ్రాలు తిప్పి అప్పటిదెప్పటిదో ఫ్లాష్ బాక్ లోకి తీసుకు వెళ్ళి, ఈ ముసలావిడను కష్టపడి యవ్వనంలో చూపించి గెంతుకుంటూ పాటలు పాడటం వగైరాలు పెట్టి మన మూడ్ ఖరాబు చెయ్యకపోవటం. ఈ ఒక్క విషయానికే అతనికి నేను ఎక్కువ మార్కులు వేస్తాను. అందరూ తొక్కి గడ్డి కూడా మొలవటానికి వీల్లేకుండా చేసేసి , దశాబ్దాలుగా చూపించి విసుగెత్తించిన ఆ చెత్త దారిన ఆయన వెళ్ళనందుకు.

సరే! సరే! నిజంగానే మళ్ళీ కథలోకి. ఆవిడ అలా తన ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తూ, కొన్నిసార్లు ఆ పురాతన తీపి జ్ఞాపకాల బాధా సంతోషాలను అనుభవిస్తూ గడుపుతూ ఉంటుంది. ఈ భావాలన్నీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా, అలవోకగా చూపించటానికే, దర్శకుడు జయ బాధురీని ఎంపిక చేశారనిపిస్తుంది, చక్కటి పాత్రోచిత Casting. ఆవిడ ఈ పాత్రను, మరెవ్వరూ చెయ్యలేరన్నంత చక్కగా, సున్నితంగా, అల్లరి-ఆగం, Tantrums, Over Action లేకుండా అద్భుతంగా చేశారు జయబాధురి. ఆవిడకు ఈ సినిమా వల్ల అవార్డు ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఆవిడకు అవార్డు వస్తే దర్శకుడికి కూడా వస్తుంది/రావాలి.

కథండీ బాబూ కథా! అయ్యో! మళ్ళీ ఎటో వెళ్ళాను కదా. ఇలా ఆవిడ జీవితం గడుస్తూ ఉండగా, అటు దేవుడు కానీ, ఇటు కథా రచయిత కానీ ఊరుకుంటారా! ఊరుకోరు అనటానికి ఈ సినిమా ఒక చక్కటి ఉదాహరణ. మొదటి నుంచీ రేడియో, అప్పుడప్పుడూ తుమ్ముతూ దగ్గుతూ ఉంటే, ఈవిడ వెళ్ళి ఒక చిన్న మొట్టికాయ వెయ్యంగానే అది మళ్ళీ పనిచెయ్యటం చూపిస్తారు దర్శకుడు. కానీ, ఒకానొక రోజున ఈవిడ తనకు తెలిసిన విద్యలు అన్నీ ఆ రేడియో మీద ప్రయోగించినా, చివరకు రేడియో విప్పి కొద్దికొద్దిగా శుభ్రపరిచినా, రేడియో పాడయ్యిపోయింది పాడయ్యినట్టే ఉండి, మూగపోతుంది.

రోజల్లా ఆ రేడియో మోగటం, ముఖ్యంగా వివిధ భారతిలో పాటలు వినటం ఆవిడ జీవితంలో ఒక భాగం అయిపోయి, ఆ రేడియో లేకపోవటాన్ని భరించలేదు, ఒక్క క్షణం నిలవలేదు. లాయరైన ఆవిడ భర్త జీవించి ఉన్నప్పుడు (ఔటాఫ్ ఫోకస్ లో ఆయన ఫొటో, ముందు గదిలో ఆయన "లా" పుస్తకాలు మాత్రమే చూపిస్తాడు దర్శకుడు-అదీ Subtle గా చూపటం అంటే), ఈ రేడియో ఎప్పుడో ఒక పుష్కరం క్రితం, అవును పన్నెండేళ్ళ క్రితం, చెడిపోతే ఆయన బాగుచేయించి తీసుకువస్తాడు. ఇప్పుడు, ఆవిడకు, ఆ రేడియో మెకానిక్ ఫోను నంబరు ప్లస్ చిరునామా కావాలి. ఇల్లంతా వెతికి నంబరు పట్టుకుని ఫోనుచేస్తే, ఆ మెకానిక్, "అవునండీ అప్పుడెప్పుడో ఒక లాయర్ గారు తీసుకు వచ్చారు. నేనే బాగుచేశాను, పన్నెండేళ్ళు పనిచేసిందా" అని ఆశ్చర్యపోయి, "సరే రిపేర్లు రావటం సహజం తీసుకురండి" అని చెప్పి ఫోను పెట్టేస్తాడు. ఈవిడ చిరునామా కోసం ప్రయత్నించి, డైరీలో, ఆ ఫోను నంబరు కిందే ఉన్న ఎడ్రస్ చూస్తుంది. పని పిల్ల "నేను కూడా వెంట రానా" అని అడిగితే, "నాకు ఇంకా ఎవరన్నా వెంట ఉంటేనే కానీ బయటకు వెళ్ళలేని స్థితి రాలేదు" అని నిర్మొహమాటంగా చెప్పి, తనే పాడయిన రేడియోను, ఒక పెద్ద సంచీలో పెట్టుకుని లోకల్ రైలు ఎక్కి వెడుతుంది.

ఇక్కడకు రాంగానే, ఎమున్నదీ సినిమా, ఈ మధ్య కాలంలో ఇలాంటి థీములతో ఏభై-అరవైలు దాటిన వారి మధ్య రొమాన్స్ సినిమాలు వచ్చినాయి కదా అనుకుని, నేను మునుపు చూసిన ఫారూక్ షేక్, దీప్తి నావల్ సినిమా "Listen Amaya..." వంటి సినిమానేలే అనుకుని, కథా గమనం కనిపెట్టాశానన్న గర్వంతో సినిమా చూడటం కొనసాగించాను. కాదు, ఈ సినిమా అలాంటి సినిమా కానేకాదు. రొమాన్స్ అనే పదమే ఈ సినిమాలోకి రాదు. నా అంచనా తప్పు అని దర్శకుడు అలవోకగా నిరూపిస్తూ, కథను కొత్త పుంతలోకి తీసుకు వెళ్ళాడు.

అటు తరువాత ఆవిడ ఆ రేడియో మెకానిక్ దగ్గరకు వెళ్ళి తన రేడియో చూపించి, "ఒక్క రోజులో అవదు" అని ఆయన అంటే, అలా రోజూ రేడియో సంచీలో పెట్టుకు మోసుకు తీసుకు వెడుతూ మళ్ళీ వెనక్కు తీసుకువస్తూ ఉంటుంది. ఈ క్రమంలో, స్వతహాగా కవి అయిన ఆ రేడియో మెకానిక్ చెప్పే మాటలు, ఉదాహరణలు మధ్యమధ్య విసిరే కవితా గుళికలతో ఇద్దరి మధ్యా రొమాన్స్ కాదు (పాపము శమించు గాక) కొద్ది స్నేహం ఏర్పడుతుంది.

ఈ వెళ్ళి రావటాలలో ఒక రోజున, రేడియో మెకానిక్, "చూడండి రేడియో దాదాపుగా బాగుపడిపోయింది, కొద్దిగా ఉన్నది, పండుగ రోజులు అవ్వంగానే కావాలిసిన పార్ట్ వచ్చేస్తుంది, రేడియో ఇక్కడే ఉంచి వెళ్ళండి బాగుచేస్తాను" అని చెప్తాడు. అప్పటికి ఆ మెకానిక్ మీద, ఈవిడకు నమ్మకం కుదిరి, రేడియో ఆ షాపులోనే వదిలేసి, పండుగ రోజులు అయిపోయినాక తెచ్చుకుందాములే అనుకుని ఇంటికి వెళ్ళిపోతుంది.

ఇక ఆ తరువాత ఏమయ్యింది? రేడియో బాగుపడిందా? ఈవిడ ఇంటికి తెచ్చుకుని మళ్ళీ సంతోషంగా రేడియో వినటం కొనసాగించిందా? రేడియో మెకానిక్ కొడుకు పాత్ర దేనికి? ఇంతకూ చివరకు ఏమయ్యింది? వంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పను. నేను కనుక ఆ ప్రశ్నలకు జవాబు చెప్పేస్తే, మీలో ఈ సినిమా చూద్దామని అనుకుని చూసినవాళ్ళకు, సినిమా చివరివరకూ చూసి అవ్వేమిటో తమంతట తామే తెలుసుకోవటం వల్ల కలిగే సంతొషాన్ని హరించిన పాపాన్ని మూటకట్టుకుంటాను.

కాబట్టి, "Waves" OTT కి వెళ్ళి ఈ సినిమా చూసి ఆనందించండి. "Waves" OTTలో సినిమా ఎలా చూడాలి?

1. మీ స్మార్ట్ టివి లేదా స్మార్ట్ ఫోనులో "Waves" App వేసుకుని; లేదా

2. https://www.wavespb.com లింకుని క్లిక్ చేసి ఆ వెబ్ సైటులోకి వెళ్ళి మీ PC/Laptop లో చూసెయ్యవచ్చు.

చూసెయ్యవచ్చు అని ఎందుకు అన్నాను అంటే ప్రస్తుతానికి, ప్రసారభారతి వారి "Waves" OTT చాలా వరకూ ఉచితంగా చూడవచ్చు. అలా ఉచితంగా చూడగలిగే సినిమాల విభాగంలోనే, ఈ సినిమా కూడా ఒకటి. "Waves" OTT గురించి విస్తారంగా మరొక పోస్టులో.

ఇంతకూ పాత్రల పేర్లు చెప్పలేదు కదూ, జయ బాధురి ధరించిన ముసలావిడ పాత్ర పేరు అమృతా కొఠారీ, రేడియో మెకానిక్ పేరు కస్తూరీ మియా. కస్తూరి అంటే మగాయనే! ఈ పేరు పురుషులకు అరుదుగా పెట్టుకుంటూ ఉంటారుట. కస్తూరి అంటే ఉర్దూలో మస్క్-సువాసన ద్రవ్యాలలో ఒకటి, మరో అర్ధం పాటలు పాడే పిట్ట అనట. మెకానిక్ కొడుకు పేరు సినిమాలో ఎక్కడా ప్రస్తావనకు రాలేదు మరి.

ఈ సినిమాకు, నేపధ్య సంగీతం, రేడియో కార్యక్రమాల ఆడియో తరచూ వినపడటం ఒక పెద్ద ఎస్సెట్. పాట వంటిది ఏదో ఉన్నది కానీ, మనకు చీకాకు పుట్టించదు.

ఒక మంచి సినిమా చూసి ఎంజాయ్ చేసిన హుషారులో, ఆ సినిమా కలిగించిన సంతోషం, మీతో పంచుకోవటానికి ఈ నాలుగు మాటలు రాశాను. పూర్తిగా చదివినవారికి ధన్యవాదాలు. మీకు అటువంటి ఆసక్తి కలిగించిన నేను ధన్యుణ్ణి.

సమీక్షకులు

శివరాం ప్రసాద్ కప్పగంతు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్



Advertisement

Next Story