ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం

by Sridhar Babu |
ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం లభించనుంది. ఇళ్ల పథకం కోసం అప్లై చేసేందుకు ప్రభుత్వం యాప్ ను రూపొందించి. ఏడాది ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యెచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ యాప్ ను 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం యాప్ ను ప్రారంభించగానే మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారు ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

నియోజకవర్గానికి 3,500 ఇళ్లు

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. తొలి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. దీంతో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గాను 17,500 ఇళ్లను మంజూరు చేశారు. అయితే ఈ యాప్ లో దరఖాస్తు పేరు, ఆధార్ సంఖ్య, సొంత స్థలం ఉందా...? ఆదాయం ఎంత..? గతంలో ఏదైనా గృహపథకంలో లబ్ది పొందారా..? తదితర 30 నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు దారుల ఇళ్లకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్ లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా ఈ పథకానికి ఆయా దరఖాస్తులు అర్హులా..? కాదా..? అనేది వెల్లడవుతోంది. అయితే లబ్దిదారుల ఎంపికను గ్రామ సభల ద్వారా చేపట్టనున్నారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, ఆదివాసీల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రెండో విడతలో సొంత స్థలం లేనివారికి సైతం అవకాశం కల్పించనున్నారు.

సాంకేతిక నైపుణ్యత..

లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల పంపిణీ పూర్తయ్యే వరకు సాంకేతిక పరిజ్క్షనాన్ని విరివిగా వాడుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణులను దృష్టిలో పెట్టుకొని యాప్ లో తెలుగు వెర్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అన్న తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

జిల్లాలో 62 గ్రామ పంచాయతీ (మున్సిపాలిటీలలో విలీనమైన 28 గ్రామాలను కలుపుకొని)లలో విచారణ అధికారులుగా గ్రామ కార్యదర్శులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ పరిధిలలో వార్డు ఆఫీసర్లను విచారణ అధికారులుగా నియమించనున్నారు. యాప్ గురువారం సీఎం ప్రారంభిస్తున్నందున ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఇందిరమ్మ ఇండ్లకు యాప్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెలాఖరు లోగా లబ్దిదారుల పేర్లను ప్రకటిస్తారు. ఇళ్లు మహిళ పేరుతోనే ఇవ్వనుండగా 400 చదరపు అడుగులలో ఇంటిని నిర్మించుకోవచ్చు.

Advertisement

Next Story