Housing Market: 2030 నాటికి దేశీయంగా 3 కోట్ల ఇళ్ల కొరత

by S Gopi |
Housing Market: 2030 నాటికి దేశీయంగా 3 కోట్ల ఇళ్ల కొరత
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2030 నాటికి దేశంలో స్వంత ఇళ్లకు గిరాకీ అత్యంత వేగంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఉన్న కొరతతో కలిపి 3.07 కోట్ల ఇళ్లు అవసరమవుతాయని ఓ నివేదిక తెలిపింది. పరిశ్రమల సంఘం సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పట్టణీకరణ, ఉపాధి అవకాశాల ఆధారంగా పట్టణాల్లో మాత్రమే 2.22 కోట్ల ఇళ్లు అవసరమవుతాయి. ఈ డిమాండ్‌లో 95.2 శాతం సరసమైన ఇళ్లు ఉంటాయని, ఇప్పటికే 1.01 కోట్ల ఇళ్ల కొరత పట్టణాల్లో ఉందని నివేదిక అభిప్రాయపడింది. దీన్ని బట్టి సరసమైన ఇళ్ల మార్కెట్ పరిమాణం రూ. 67 లక్షల కోట్లు ఉండోచ్చని అంచనా. ప్రస్తుతం సరసమైన ఇళ్ల మార్కెట్ విలువ రూ. 13 లక్షల కోట్లు ఉంది. ఇదే సమయంలో భవిష్యత్తులో వివిధ ఆర్థిక సంస్థలు ఇచ్చే గృహ రుణాల వాటా గణనీయంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. కొత్తగా ఇళ్లను కొనేవారిలో సుమారు 77 శాతం మంది 2030 నాటికి రుణాలు తీసుకుంటారని నివేదిక భావిస్తోంది. 2030 నాటికి సరసమైన ఇళ్ల విభాగంలో దాదాపు రూ. 45 లక్షల కోట్లను బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇవ్వనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed