- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెవెన్యూ వ్యవస్థ బలహీన పడింది : లచ్చిరెడ్డి
దిశ,మేడ్చల్ బ్యూరో : వీఆర్ఏ, వీఆర్వోలను ఇతర విభాగాలకు పంపించడంతో రెవెన్యూ వ్యవస్థ బలహీన పడిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పూర్వ వీఆర్వోలకు శుభవార్త అందిస్తామని, పూర్వ వీఆర్వోల సమస్యలన్నీ సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తానని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్ మండలం తూంకుంట గ్రామంలోని మొగుళ్లలో మేడ్చల్ జిల్లా తూంకుంట లోని మొగుళ్ల వెంకటరెడ్డి గార్డెన్స్ లో జరిగిన గ్రామ రెవెన్యూ అధికారుల ఆత్మీయ సమ్మేళనంలో లచ్చి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామస్థాయిలో వీఆర్వోల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. విజ్ఞానం కన్నా అనుభవం గొప్పదని అన్నారు. వీఆర్వోలు గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థకు పట్టు కొమ్మలుగా ఉన్నారని, పూర్వ వీఆర్ఓల అవసరం నూతనంగా రాబోతున్న రెవెన్యూ చట్టానికి అత్యంత అవసరమని అన్నారు. ఈ విషయంపై తాను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి రెవెన్యూ వ్యవస్థలో పూర్వ వీఆర్వోలను కలుపుకుని వెళ్లేలా ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఒక సమగ్రమైన విధానపరమైన నిర్ణయం తీసుకున్న తరువాత రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంలో పూర్వ వీఆర్వోలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మీ సేవలు ప్రభుత్వం మరిచిపోలేదని, మీ అవసరం ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసని, మీకు త్వరలోనే ప్రభుత్వం నుండి శుభవార్త వస్తుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. పూర్వ వీఆర్వోలను కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద అసోసియేషన్ ను నూతనంగా నిర్మిస్తామని, దానికి తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అని నామకరణం చేస్తామని వేలాది మంది పూర్వ వీఆర్వోల కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు.
నిఘా వ్యవస్థ లోపం..
గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్ ఓ, వీఆర్ఏలను రెవెన్యూ శాఖకు దూరం చేసిందని లచ్చిరెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు దూరం చేయడమే కాకుండా, ఉద్యోగుల సమస్యలను పెండింగ్ లో ఉంచిందని విమర్శించారు. గ్రామ స్థాయిలో వీఆర్ఏ, వీఆర్వోలు లేకపోవడంతో నిఘా వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. గ్రామ స్థాయిలో నిఘా వ్యవస్థ లోపించడంతోనే ఇటీవల వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడులు జరిగినట్లు చెప్పారు. పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలకు తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రెవెన్యూ వ్యవస్థలోకి మళ్లీ మీరు రాకుండా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.
నాడు వీఆర్ఏ, వీఆర్వోలకు నష్టం చేసిన వారే.. నేడు ఏదో మేలు చేస్తామంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు. గచ్చిబౌలి, ఇతర ప్రాంతాలలోని ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన హౌసింగ్ సొసైటీల నాయకులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సింగారం రాములు మాట్లాడుతూ ఇటీవల లగచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి అత్యంత బాధాకరమని, అందుకు గ్రామీణ వ్యవస్థలో వీఆర్వోలు లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. వీఆర్వోలు ప్రధానమైన విధుల్లో భాగంగా గ్రామపంచాయతీలో అత్యంత కీలక సమాచారం చేరవేయడంలో భాగస్వాములు అవుతారని, ప్రస్తుతం గ్రామాలలో వీఆర్వోలు లేకపోవడం వల్లే లగచర్లలో కలెక్టర్ పై దాడి జరుగుతుందన్న ముందస్తు సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గుర్తు చేశారు. తెలంగాణ తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక మాట్లాడుతూ వీఆర్ఓ లకు పూర్వవైభవం వస్తుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం పూర్వ వీఆర్వోల విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తుందన్నారు. మీ అవసరం ప్రభుత్వానికి ఉందన్న చర్చ జరుగు తుందన్నారు. తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా విధి నిర్వహణలో మానసిక ఆందోళన అనుభవిస్తున్న పూర్వ వీఆర్వోల పోరాటం వృథా కాదన్నారు. ధైర్యంగా ఉండండి... ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లండి... మీకు మేము అండగా ఉన్నామని పూల్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇప్పటి వరకు ఆత్మాభిమానం చంపుకొని బతికిన మీరు ఆత్మగౌరవంతో బతికే రోజులు ముందున్నాయని, రేవంత్ రెడ్డి సర్కారు మీకు అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు పొడపంగి రాధ మాట్లాడుతూ గత ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసిన రోజు నిజంగా రెవెన్యూ వ్యవస్థలో బ్లాక్ డే అని అన్నారు. ఆ బ్లాక్ డే ను వైట్ డే గా మార్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితర క్యాబినెట్ మంత్రులు పూర్వ వీఆర్ఓలకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
పూర్వ వీఆర్వోలకు మంచి రోజులు వస్తాయని అన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూలోని వీఆర్వోలను హీనంగా చూసిందన్న భావన నెలకొని ఉందని ఆమె అన్నారు. పూర్వ వీఆర్వోల ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షత వహించిన గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్ర రావు మాట్లాడుతూ... తమను మాతృ సంస్థగా భావించే రెవెన్యూలో విలీనం చేసి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఇష్టమైన శాఖ కాబట్టి కష్టమైనా ఇష్టంగా భావించి ప్రభుత్వం కోసం, రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంలో కష్టపడి పని చేస్తామని హామీ ఇచ్చారు. కొన్నేళ్ల పాటు ఆత్మగౌరవం కోల్పోయి అవమానంగా జీవిస్తున్న పూర్వ వీఆర్వోలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవాలని వేడుకున్నారు.
గరికె ఉపేంద్ర రావు ఆధ్వర్యంలో విజయవంతమైన వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్వ వీఆర్వోలు భారీగా తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన పూర్వ వీఆర్వోలతో సమావేశం ఘనంగా జరిగింది. తొలుత ఇటీవల చనిపోయిన పూర్వ వీఆర్వోలకు, రెవెన్యూ ఉద్యోగులకు సంతాపం తెలిపిన అనంతరం గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్ర రావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్, సత్యనారాయణ, శిరీష రెడ్డి, లింగరాజు, రికార్డు అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దాసరి వీరన్న, లక్ష్మీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.