అయ్య డప్పు కొట్టుకుంటున్నాడు.. కొడుకు సెల్ఫీలు దిగుతున్నాడు..రేవంత్ రెడ్డి

by Sumithra |
అయ్య డప్పు కొట్టుకుంటున్నాడు.. కొడుకు సెల్ఫీలు దిగుతున్నాడు..రేవంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పేదోళ్లకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పీసీసీ చీఫ్, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే మేం ఓట్లు అడుగుతాం. ఎక్కడ మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టారో అక్కడే మీరు ఓట్లు అడగండి. సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి రేవంత్ సవాల్ విసిరారు. మీ ఒంట్లో చీము, నెత్తురు ఉంటే మీసమున్న మగాళ్లు అయితే నా సవాల్ ను స్వీకరించాలన్నారు. ఈ సవాల్ ను స్వీకరిస్తే ఏ నియోజకవర్గంలోనూ మీకు డిపాజిట్లు రావు. అయినా మీకు డిపాజిట్లు వస్తే మేం గుండు కొట్టించుకుంటాం” అని రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా, మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో కుమ్మరి ఎల్లవ్వకు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహాప్రవేశానికి రేవంత్ రెడ్డి ముఖ్యఅథితిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగిరారు.

గతంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎల్లవ్వ ఇల్లు చూశాను. ఎల్లవ్వ ఇంటికి వచ్చి చూస్తే.. మురికి నీరు అంతా ఆ ఇంట్లోకే వెళ్ళేది.. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళడానికి మంచి దారి వేసుకున్నారు. కానీ, ఎల్లవ్వ ఇల్లు కంటే 6 ఫీట్లు ఎత్తు రోడ్డు వేసి ఎల్లవ్వ ఇల్లును ముంచారు. రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని ఎంపీగా కలెక్టర్ కు చెప్పినా పట్టించుకోలేదు. ఇక్కడి బీఆర్ఎస్ నాయకులకు భూకబ్జాలు తప్ప పేదల బాధలు పట్టవు. అందుకే మా నాయకులు హరివర్దన్ రెడ్డి, తోటకూర జంగయ్య యాదవ్ లకు చెప్పి ఎల్లవ్వకు ఇందిరమ్మ ఇల్లు కట్టించామన్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్రం మొత్తం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని స్పష్టంచేశారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు ఇరుకు ఆన్న కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ అంటూ అధికారంలోకి వచ్చాడు కానీ పదేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ల జాడ లేదని ఎద్దేవ చేశారు. కేసీఆర్ మాత్రం 10ఎకరాల విస్తీర్ణంలో పంజాగుట్ట చౌరస్తాలో 2వేల కోట్ల రూపాయలతో ఇల్లు మాత్రం కట్టుకున్నాడు అని విమర్శించారు. కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ లు కట్టించేశామని అయ్యా ఏమో డప్పులు కొట్టుకుంటున్నాడని, కొడుకేమో సెల్ఫీలు దిగుతున్నాడని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు.

మల్లారెడ్డి మాత్రమే అభివృద్ధి..

మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం మల్లారెడ్డి కుటుంబంలో మాత్రమే జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రిమల్లారెడ్డి తన తెలివితేటలను భూములను దోచుకోవడానికి ఉపయోగించడు గాని నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదని విమర్శించారు.

హామీల వర్షం...

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులలో రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటాం” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఎల్లవ్వతో కలిసి గృహప్రవేశం చేసిన రేవంత్..

కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం రోడ్డు నిర్మాణ పనుల్లో ఇల్లు కోల్పోయిన కుమ్మరి ఎల్లవ్వ కు గతంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఆమె ఇంటిని పరిశీలించారు. ఆ సందర్భంలో కుమ్మరి ఎల్లవ్వకు కాంగ్రెస్ పార్టీయే ఇల్లు నిర్మాణం పూర్తి చేసి కానుకగా ఇస్తుందని హామీ ఇచ్చారు. దీంతో రేవంత్ ఆదేశాల మేరకు మూడు చింతలపల్లి జెడ్పీటీసీ అయిన టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పూర్తి బాధ్యత తీసుకుని ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై బాధితురాలతో కలిసి గృహప్రవేశం చేశారు.

టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర జంగయ్య యాదవ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ, బీ బ్లాక్ అద్యక్షులు సింగరేణి పోచయ్య, వేముల మహేష్ గౌడ్, మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, గౌడెల్లి సర్పంచ్ సురేందర్, మండల వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్, గ్రామ ఉపసర్పంచ్ కటికల వైద్యనాథ్, గ్రామ మాజీ సర్పంచ్ బండి జగన్నాథం, వీరేశం , ఎంపీటీసీలు హన్మంతరెడ్డి, ముద్దం అఖిలేష్ రెడ్డి, కొల్తూర్ గ్రామ సర్పంచ్ నల్ల శిల్పా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed