33 గుంటలు కబ్జా చేసినవే.. గతంలోనే ఆక్రమించుకున్న మల్లారెడ్డి!

by Anjali |
33 గుంటలు కబ్జా చేసినవే.. గతంలోనే ఆక్రమించుకున్న మల్లారెడ్డి!
X

దిశ, మేడ్చల్ బ్యూరో: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మండలం, జీడిమెట్ల సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి 33 గుంటల భూమిని కబ్జా చేశారని రెవెన్యూ అధికారులు తేల్చినట్లు సమాచారం. దశాబ్దకాలంగా ఆ భూమిని తన ఆధీనంలోనే ఉంచుకున్నారని కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు మేడ్చల్ కోర్టుకు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. సుచిత్ర సర్కిల్ సమీపంలోని మిలటరి కాంపౌండ్ వాల్ రోడ్డులో మల్లారెడ్డికి ఇతరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ భూవివాదం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టించింది.

పోలీసులపై మల్లారెడ్డి ఫైర్

మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల విలేజ్ సర్వేనెంబర్ 82, 83లో మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూవివాదం చోటుచేసుకుంది. భూ వివాదం విషయంలో గత నెల 18న తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి మండిపడుతూ.. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. పోలీసులు రంగప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తన భూమిలో ఫెన్సింగ్ చేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులపై మల్లారెడ్డి చిందులు తొక్కారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం తన అనుచరులతో పోలీసుల ముందే ఫెన్సింగ్‌ను కూల్చివేయించారు. ఇంతలోనే ఘర్షణ జరుగుతున్న భూమి తమదేనంటూ 15 మంది ఘటనా స్థలికి వచ్చారు.

మామా అల్లుళ్ల అరెస్టు

సర్వే నెంబరు 82/1/EEలో శ్రీనివాస్ రెడ్డికి చెందిన 8,993 గజాల స్థలాన్ని మల్లారెడ్డి కబ్జా చేశాడ అనే ఆరోపణలతో వివాదం మొదలైంది. శ్రీనివాస్ రెడ్డి వద్ద నుంచి 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని ఆ 15 మంది పోలీసులకు చెప్పారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలుపగా, దీంతో ఇరువురి వాదనలు విన్న పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. ఒక దశలో ఇరువర్గాల మధ్య గొడవ పెద్దదవుతున్న తరుణంలో పోలీసులు మల్లారెడ్డిని, ఆయన అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలను అరెస్టు చేసి పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు. సేరి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు ఎమ్మెల్యే మర్ర రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేయగా, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఫిర్యాదుతో గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజకీయ దూమారం

సుచిత్ర భూ వివాదం రాజకీయ దుమారాన్ని రేపింది. తమ భూమిని కాంగ్రెస్ నాయకులు కొన్నేళ్లుగా కబ్జా చేయాలని చూస్తున్నారని, హస్తం పార్టీ అధికారంలోకి రాగానే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. దీనిపై అవతలి వర్గం మాత్రం మాజీ మంత్రి మల్లారెడ్డిది కేవలం ఎకరం 29 గుంటలు మాత్రమే ఉందని, మిగితాదంతా తమదేనని వాదించారు. అనవసరంగా కాంగ్రెస్ నాయకులను భూ వివాదంలోకి లాగుతున్నారని, న్యాయస్థాన ఉత్తర్వులను మల్లారెడ్డి, ఆయన అల్లుడు బేఖాతరు చేస్తున్నారని ఆ 15 మంది మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తనపై, కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు అవాస్తమని పత్రికా సమావేశంలో ఖండించారు.

ఆగమేఘాల మీద సర్వే

అయితే వివాదాస్పద భూమిలో అధికారులు ఒకటికి రెండుసార్లు సర్వే చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. సర్వేయర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సర్వే నెంబరు 82/p లో 2.22 ఎకరాలు, సర్వేనెంబర్ 83/p లో ఆరు గుంటలు భూమి ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు ధ్రువీకరించినట్లు సమాచారం. ఈ మొత్తం భూమి వివాదాస్పద భూమి కాంపౌండ్ వాల్ లోపల ఉన్న స్థలంగా పేర్కొన్నట్లు తెలుస్తుంది.

మల్లారెడ్డి ఆధీనంలోనే 33 గుంటలు

సర్వే ఆధారంగా రెవెన్యూ అధికారులు 33 గుంటలు మల్లారెడ్డి ఆధీనంలోనే ఉన్నట్లు తేల్చారు. సర్వే నెంబరు 82లోని 33 గుంటల భూమిని ఆయన కబ్జా చేసినట్లు కోర్టుకు నివేదిక అందజేశారు. ఇదే విషయమాన్ని పేట్ బషీర్‌బాద్ పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. అదేవిధంగా సర్వే నెంబర్ 83లో 3వేల గజాల స్థలాన్ని మల్లారెడ్డి తన ఆధీనంలోనే పెట్టుకున్నారని, దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తామని ఓ రెవెన్యూ అధికారి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed