ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొర సౌకర్యాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ ?

by Sumithra |
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొర సౌకర్యాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ ?
X

దిశ, ఉప్పల్ : ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని ఉచితం. వైద్యం, టెస్టులు, మందులు ఇలా అన్ని ఫ్రీగా ఇస్తారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్థోమత లేనివారు ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుంటారు. కానీ ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రం కనీస వసతులు లేక కొట్టుమిట్టాడుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కనీస సౌకర్యాల కల్పనలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మరుగుదొడ్లు నిర్వహణ సక్రమంగా లేక గర్భిణీ స్త్రీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీలు ప్రసవం అయిన తర్వాత పడుకుందామంటే బెడ్లు సరిగా లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

తలుపులు లేక లేబర్ రూమ్..

ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలలు గడుస్తున్నా తలుపులు లేక లేబర్ రూమ్ దర్శనమిస్తుంది. పట్టించుకునే అధికారులు కరువయ్యారు. రాత్రి దొంగలు పడ్డా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు.

30 వేల రూపాయల నిధులు మంజూరు..

ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ కన్వీనర్ బన్నాల గీత ప్రవీణ్ జూన్ 11 వ తారీఖున ఆరోగ్య కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన 30 వేల రూపాయలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులకు వాడాలన్నారు. కానీ నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. ప్రభుత్వం మంజూరు చేసిన 30 వేల రూపాయలను లేబర్ రూమ్ తలుపులకు, ఇన్ పేషెంట్ బెడ్లకు ఉపయోగించకుండా దేనికి ఉపయోగించారని ? ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story