భారత్ ప్రపంచానికి ఆరోగ్య సూత్రాలను అందిస్తోంది: ఎంపీ ఈటల రాజేందర్

by Mahesh |
భారత్ ప్రపంచానికి ఆరోగ్య సూత్రాలను అందిస్తోంది: ఎంపీ ఈటల రాజేందర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: భారత్ దేశం ప్రపంచానికి ఆరోగ్య సూత్రాలను అందిస్తుందని మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుచిత్రలోని శివహం యోగా రీసెర్చ్ సెంటర్, స్వచ్ఛ భారత్ అభియాన్, పతంజలి యోగా సమతి, భారత స్వాభిమానం ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో కూకట్ పల్లి వై జంక్షన్ ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్, మేడ్చల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ప్రాచీన దేశం, అవుట్ డేటెడ్ కల్చర్ ఉన్న దేశం అని ప్రపంచ దేశాలు భావించేవారన్నారు. నాడు మన దేశం అంటే చిన్న చూపు చూసే పాశ్చాత్య దేశాలు కూడా యోగాను ఆచరిస్తున్నయన్నారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత యోగ అనేది సనాతన ధర్మం కాదు ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన సాధనమని, ముఖ్యంగా ప్రశాంతత కోసం ప్రపంచ మానవాళికి ఇది అవసరమని అన్ని దేశాలను ఒప్పించి ప్రపంచ యోగ దినోత్సవంగా అనుసరించేలా చేశారని తెలిపారు. ప్రపంచ దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు యోగా ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పి 2014లో అంతర్జాతీయ యోగా డే మోడీ ప్రకటించినట్లు తెలిపారు.

ఆరోగ్యమే మహాభాగ్యం

ఒకనాడు శ్రమ చేసేవారికి కిడ్నీ ఫెయిల్యూర్లు, హార్ట్ ఎటాక్ వచ్చేవి కావని ఈటల స్పష్టంచేశారు. కానీ ప్రస్తుతం శ్రమ చేసే వారికి, చేయని వారికి.. డబ్బు ఉన్నవారికి లేనివారనే తేడా లేకుండా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు.30 ఏళ్లకే కిడ్నీ ఫెయిల్యూర్స్, లివర్ సిరోసిస్, హార్ట్ ఎటాక్ లాంటి ప్రాణాంతమైన వ్యాధులను చూస్తూ ఉన్నామని, ఇవన్నీ కూడా అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యలన్నారు.గతంలో నడిచే వాళ్ళం, సైకిల్ తొక్కే వాళ్లం.. కానీ ఇప్పుడు శ్రమ మన జీవితంలో భాగమనే విషయం మర్చిపోయామని తెలిపారు. కూరగాయలకు కూడా కారులో పోతున్నాం.నడక మర్చిపోయాము. టెక్నాలజీ శ్రమను తగ్గించింది. కానీ శ్రమ తగ్గితే వచ్చే ఆరోగ్య సమస్యల మీద మనం దృష్టి పెట్టడం లేదన్నారు.శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే యోగా మాత్రమే ఏకైక సాధనమని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం భారతదేశమన్నారు.భారత పౌరులుగా యోగాను సంపూర్ణంగా ఆచరించాలని.. ఆరోగ్యమే మహాభాగ్యము అనే సూత్రాన్ని పాటించాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు మాధవరం కాంతారావు ,వడ్డేపల్లి రాజు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ కొండం ఆంజనేయులు,మేడ్చల్ ఎంపీపీ రజిత రాజ మల్లారెడ్డి,ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజ హరినాథ్, రంగారెడ్డి, పతంజలి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed