పంచాయతీల్లో మడత పేచీ..?!

by Sumithra |
పంచాయతీల్లో మడత పేచీ..?!
X

దిశ, మేడ్చల్ బ్యూరో : అయ్యవారు ఏమి చేస్తున్నారంటే చేసిన తప్పులను లెక్క వేసుకుంటున్నట్లు ఉంది మన మేడ్చల్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పాలన తీరు. పెరిగిన జనాభాకు అనుగుణంగా గ్రామాల్లో సిబ్బందిని నియమించాల్సి ఉన్నప్పటికీ, పాత జీవోల దుమ్ము దులిపి ఉన్న సిబ్బందిలో కోత విధించేందుకు కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల జిల్లా బాస్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం పనిచేస్తున్న అన్ని కేటగిరీల జాబితాను పరిశీలించే పనిలో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో పంచాయతీల్లో దినసరి కూలి కింద పనిచేస్తున్న వారి ఉద్యోగం ప్రమాదంలో పడింది.

జీవో 51 ప్రకారం..

గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది కుదింపుపై మేడ్చల్ జిల్లా పంచాయతీ అధికారులు తీసుకున్న నిర్ణయం రాష్ట్రమంతటికి పాకింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల డేటాను సేకరిస్తున్నట్లు సమాచారం. 2019లో తీసుకువచ్చిన జీవో 51 లోని మార్గదర్శకాల ప్రకారం అదనపు సిబ్బందిని తొలగించే పనిలో పడ్డారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని సర్పంచ్ లు పంచాయతీల్లో తమ వెసులుబాటుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు సర్పంచ్ లు రాజకీయ జోక్యంతో ఇష్టానుసారంగా సిబ్బందిని నియమించి వేతనాలు చెల్లించలేక అవస్థలు పడ్డారు.

దీంతో గత సర్కార్ మల్టీ పర్పస్ వర్కర్స్ (ఎంపీడబ్ల్యూఎస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను 2019లో జీవో నెంబర్ 51 ద్వారా జారీ చేసింది. ఈ జీవో మేరకు ప్రతి గ్రామ పంచాయతీకి ఇద్దరు ఎంపీడబ్ల్యూలు ఉండేలా చర్యలు తీసుకుంది. అయితే ఎక్కువ జనాభా ఉండే గ్రామ పంచాయితీల్లో 500 జనాభాకు ఒకరు చొప్పున ఒక మల్టీ పర్పస్ వర్కర్ ను అదనంగా నియమించాలని సూచించింది. దీనికి అనుగుణంగా 2011 నాటి జనాభా లెక్కలను ప్రతిపాదికగా చేసుకుని ఏ పంచాయతీకి ఎంత మంది సిబ్బందిని మల్టీ పర్పస్ వర్కర్లుగా గుర్తించాలో నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో సగానికిపైగా పంచాయతీ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రస్తుత జనాభాతో ఇక్కట్లు..

మేడ్చల్ జిల్లాలో 2011 జనాభాతో పోల్చితే ఒక్కో గ్రామంలో జనాభా విపరీతంగా పెరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఆనుకుని ఉండడంతో జిల్లాలోని గ్రామాలన్నీ పట్టణాలుగా మారాయి. రియల్ వ్యాపారం బాగా పుంజుకుంది. పెద్ద ఎత్తున కాలనీలు, అపార్ట్ మెంట్లు, విల్లాలు వెలిశాయి. శివారున ఉన్న 28 గ్రామాలు మున్సిపాలిటీలలో విలీనానికి ముందు జిల్లాలో 61 గ్రామ పంచాయతీలలో 789 మంది మల్టీ పర్పస్ వర్కర్స్ పనిచేస్తున్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 63 గ్రామ పంచాయతీలలో ఒక లక్ష 45 వేల మంది జనాభా మాత్రమే నమోదై ఉంది. అప్పటి జనాభాను పరిగణనలోకి తీసుకుంటే 290 మంది మల్టీ పర్పస్ వర్కర్స్ మాత్రమే మిగిలే అవకాశం ఉంది. మున్సిపాలిటీలలో కలిసిన 28 గ్రామాలను మినహాయిస్తే మిగిలిన 33 గ్రామ పంచాయితీల్లో కేవలం 130 మంది సిబ్బంది మాత్రమే మిగలనున్నారు. అయితే 2011 జనాభాతో పోల్చితే ఆయా గ్రామాల్లో జనాభా ఎన్నో రేట్లు పెరిగింది. దీంతో సిబ్బందిని తగ్గిస్తే గ్రామాల్లో విధుల నిర్వహణ కష్టమవుతుంది.

పెరిగిన పని భారం...

ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని గ్రామ పంచాయితీకి ముడిపెట్టి నిర్వహిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇంటి పన్నులు, నల్లా బిల్లుల వసూలు, ఇతర గ్రామ పంచాయేతర ప్రభుత్వ పథకాల అమలు పనులు పంచాయతీ సిబ్బందికే ప్రభుత్వంతో పాటు, అధికారులు అప్పగిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఉపాధి హామీ పనులను కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శులే పర్యవేక్షించారు. దీంతో జీవో నెంబర్ 51 మార్గదర్శకాలు ఎలా ఉన్నా, చాలా గ్రామ పంచాయితీల్లో అవసరాల మేరకు అదనపు సిబ్బందిని సర్పంచ్ లు వారికున్న అధికారంతో దినసరి వేతనాల కింద నియమించుకున్నారు. ఎంపీడబ్ల్యూ కింది గుర్తించిన వారికి ప్రభుత్వం తరపున రూ.9500 వేతనంగా చెల్లిస్తుండగా, మరో రూ.5000 గ్రామ పంచాయతీ నిధుల నుంచి కలిపి మొత్తంగా రూ.14,500 వారికి చెల్లిస్తున్నారు. అయితే మేడ్చల్ జిల్లాలో అసలే గ్రామాల విస్తీర్ణం పెరిగి ఉన్న పనికే పారిశుధ్య సిబ్బంది సరిపోదనుకుంటే అదనంగా ప్రభుత్వ పాఠశాలలను ఊడ్చటం, టాయ్ లెట్ బ్లాక్ లను శుభ్రం చేయటం వంటి వాటితో పనిభారం పెరిగిందని గ్రామ పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పట్లోనే వ్యతిరేకించిన కార్మిక సంఘాలు..

గ్రామ పంచాయతీల్లో ఎంపీడబ్ల్యూ విధానాన్ని కార్మిక సంఘాలు అప్పట్లోనే వ్యతిరేకించాయి. ఇది లోపభూయిష్టమైన నిర్ణయమని వాదించాయి. మల్టీ పర్పస్ వర్కర్ విధానం కింద ఓ చిన్న గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ విధులు నిర్వర్తించే వ్యక్తి ఎంపీ డబ్ల్యూ విధానం ప్రకారం మురుగు కాల్వలు కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది. నైపుణ్యం లేకపోయినా విద్యుత్ స్తంభం ఎక్కి విధీలైట్లు ఏర్పాటు చేయాల్సి రావడం, డ్రైవింగ్ రాకున్నా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను నడపడం వంటి విధులు నిర్వహించడం అశాస్త్రీయమని కార్మిక సంఘాలు అభ్యంతరం చెప్పాయి. అవసరాలు, అర్హత మేరకే పంచాయతీ సిబ్బందిని కేటాయించారని, ఎలక్ట్రీషియన్ విధులు చేసే వ్యక్తితో మురుగు కాల్వలు శుభ్రం చేయించడం సరికాదని, వాదించాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న జనాభా లెక్కలు వచ్చే వరకు సిబ్బందిని యధావిధిగా కొనసాగించాలని, కొత్త లెక్కల ప్రకారం సిబ్బందిని కుదించాలా..? లేక పెంచాలా..? అనే నిర్ణయాన్ని తీసుకోవాలని పంచాయతీ కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed