నగర శిఖలో డబుల్ డెక్కర్ కారిడార్లు

by Mahesh |   ( Updated:2025-01-01 03:10:03.0  )
నగర శిఖలో డబుల్ డెక్కర్ కారిడార్లు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. మహానగరంలో తొలి డబుల్ డెక్కర్, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పాలన సాగిస్తున్న కంటోన్మెంట్ బోర్డు కారిడార్ల నిర్మాణానికి అమోద ముద్ర వేసింది. 2016 లో అప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎలివేటెడ్ స్కైవేలు, కారిడార్లు, లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కారిడార్లతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది.

నేషనల్ హైవే 44 పైన..

సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్ బండ్ జంక్షన్, బోయిన్‌పల్లి మీదుగా డెయిరీ ఫామ్ రోడ్డు వరకు రూ.1,580 కోట్ల వ్యయంతో 5.320 కిలో మీటర్ల కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కిలో మీటర్లు కాగా, అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.600 కిలో మీటర్లు ఉంటుంది. మొత్తం 131 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయిన్‌పల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపుల (0.248 కి.మీ వద్ద), (0.475 కిలో మీటర్ వద్ద) రెండు చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు. ప్రస్తుతం కారిడార్ పనుల్లో కీలకమైన భూముల అప్పగింత ప్రక్రియ సాగుతోంది. ఈ కారిడార్లకు సంబంధించి ఇప్పటికే రక్షణ శాఖ భూములను హెచ్ఎండీఏకు అప్పగిస్తూ గతంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణం మరింత క్షేమంగా, వేగంగా సులువుగా సాగనుంది.

భూసేకరణ కష్టమే..

అయితే.. ప్రాజెక్ట్ కోసం సేకరించాల్సిన భూమిలో మతపరమైన నిర్మాణాలు, శ్మశానవాటికలు, విద్యా సంస్థలు, అపార్ట్‌మెంట్లు ఉండటంతో అధికారులకు పెద్ద సవాలుగా మారింది. 294.81 గజాల విస్తీర్ణంలో ఉస్మానియా పీజీ కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఓపెన్ ల్యాండ్ ఉండగా 4475.50 గజాల స్థలంలో ముస్లిం శ్మశానవాటిక, 3954.40 గజాల్లో మరో శ్మశానవాటిక, 1968.10 గజాల విస్తీర్ణంలో పోలీస్, ఎస్‌పీహెచ్‌ఎస్ పోర్ట్ ఆఫీస్, బోవెన్‌లోని ఓడరేవు క్రికెట్ క్వార్టర్స్, జడ్‌పీహెచ్‌ఎస్ మైదానాలు ఉన్నాయి. వీటితో పాటు పలు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లు, కమర్షియల్ బిల్డింగులు కూడా ఉండటం గమనార్హం. ఇదే కాకుండా ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ వరకు ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.12 కిలోమీటర్ల మేర మరో ఎలివేటెడ్ కారిడార్‌ను రూ.3,619 కోట్లతో ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed