కాల్చితే కాలుష్యం.. కలియదున్నితే భూ సారం..

by Sumithra |
కాల్చితే కాలుష్యం.. కలియదున్నితే భూ సారం..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : జిల్లాలో వానాకాలం వరి కోతలు దాదాపు పూర్తవగా, రైతులు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వానాకాలంలో పంటను కోశాక వెంటనే వరి కొయ్యలను, మిగిలిన గడ్డిని రైతులు తగుల బెడుతున్నారు. దీంతో పొలంలో కీటకాలు, వ్యాధి కారక సూక్ష్మజీవులు నశింపజేయవచ్చు అనేది రైతుల అభిప్రాయంగా ఉన్నది. కానీ వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడడమే గాక భూసారాన్ని వృద్ధి చేసేందుకు ఉపయోగపడే పదార్థాలు నశించి పోతాయని, వాటిని కాల్చకుండా భూమిలోనే కలియదున్నితే మంచి ఫలితాలు పొందవచ్చని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రకళ చెబుతున్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలను వాటిని భూమిలో కలియదున్నితే చేకూరే లాభాలు ఈ విధంగా ఉన్నాయి.

కాల్చడం వల్ల నష్టాలు..

నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఆవిరైపోతాయి. తద్వారా భవిష్యత్ పంటల కోసం అందుబాటులో ఉండవు. వాయు కాలుష్యం.. కాల్చడం వల్ల వాయు మాలిన్యం ఏర్పడి ఊపిరితిత్తుల సమస్యలకు దారి తీస్తుంది. కీటకాల పెరుగుదల... తగలబడకుండా ఉన్న అవశేషాలు, కీటకాలు వ్యాధులకు నివాసాలుగా మారతాయి. జీవ వైవిధ్యం తగ్గడం.. మట్టిలోని సూక్ష్మజీవాలు దెబ్బతిని భూమి సంతులనం కోల్పోతుంది. నీటి నిల్వ తగ్గడం.. కాల్చడం వల్ల మట్టిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి భవిష్యత్ పంటలకు ఎక్కువ నీటి అవసరం ఉంటుంది.

కలియదున్నితే లాభాలు..

వరి అవశేషాలను కాల్చకుండా పున:సంస్కరణలు చేసుకోవడం వల్ల భూమి ఆరోగ్యం మెరుగు పడేలా, పర్యావరణ పరిరక్షణ ఉండేలా చేస్తోంది. వరి గడ్డి పెరిగేందుకు నత్రజని, భాస్వరం, పొటాశ్, సూక్ష్మ పోషకాలను తీసుకుంటుంది. తిరిగి ఈ కొయ్యలను నేలలో కలపడం ద్వారా సేంద్రియ పదార్థాలుగా మారి భూసారాన్ని పెంచుతాయి. వరి కోసిన వెంటనే మిగిలిన తేమను ఉపయోగించుకుని దున్నడం వల్ల వరి అవశేషాలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా చేయడం వల్ల నేలలో పగుళ్లు రావడం, తేమ ఆవిరి కావడం తగ్గుతోంది. వర్షపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు. నాట్లు వేసేందుకు ముందు దమ్ము వేసేటప్పుడు ఎకరాకు 50 కిలోల సూపర్ ఫాస్పేట్ వేయడం వల్ల కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థాలుగా మారుతాయి. దీంతో దిగుబడి సైతం 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

కాల్చడం వల్ల నష్టాలు.. మేడ్చల్ జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ..

వరి అవశేషాలను కాల్చడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. నేలలో ఉన్న పోషకాలు ఆవిరైపోతాయి. వాయు కాలుష్యం ఏర్పడుతోంది. జీవవైవిధ్యం, నీటి నిల్వలు తగ్గిపోతాయి. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రత తగ్గించాలన్నా, నేలలో కర్బన శాతం పెరగాలన్నా వ్యవసాయ వ్యర్థాలను తిరిగి నేలకే చేర్చడం ఉత్తమమైన పద్ధతి. ఇకపోతే వరి అవశేషాలను కాల్చకుండా కంపోస్టు తయారీలో ఉపయోగించుకోవచ్చు. పశువుల మేతకు వాడుకోవచ్చు. వరి కొయ్యలను కాల్చవద్దని, త ద్వారా పర్యావరణం, భూసారానికి హాని కలుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed