West bengal: పశ్చిమ బెంగాల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ముర్షిదాబాద్ జిల్లాలో ఉద్రిక్తత

by vinod kumar |
West bengal: పశ్చిమ బెంగాల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ముర్షిదాబాద్ జిల్లాలో ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని ముర్షిదాబాద్ (Murshidabadh) జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో హింస చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని బెల్డంగా(Beldanga)లో కార్తీక పూజ మండల్ సమీపంలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుపై ఒక కమ్యూనిటీని కించపర్చేలా అభ్యంతరకరమైన సందేశం రాయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. అనంతరం ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నట్టు పేర్కొన్నారు. పలువురి ఇళ్లను ధ్వంసం చేయగా, మరికొన్నింటికి ఆందోళన కారులు నిప్పుపెట్టారు.

విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 17 మందిని అరెస్ట్ చేశారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా బెల్దంగాలో ఇంటర్నెట్ పై నిషేధం విధించడంతో పాటు బీఎన్ఎస్(BNS) సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మతపరమైన వేడుకను నిర్వహించిన కమిటీ అధ్యక్షుడు, కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన అనంతరం తృణమూల్ కాంగ్రెస్(TMC), బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగింది. బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ(Amith malaviya) ఘటనపై స్పందిస్తూ..‘ప్రతి పూజ, పండుగ సందర్భంగా దాడి జరుగుతోంది. అయినప్పటికీ సీఎం మమతా బెనర్జీ(Mamatha benarjee) మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అల్లర్లను నియంత్రించడంలో వారు విఫలమయ్యారు’ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ కౌంటర్ ఇచ్చింది. అమిత్ ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేసింది. ఈ ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడింది.

Advertisement

Next Story

Most Viewed